Begin typing your search above and press return to search.

'రిపబ్లిక్' టీజర్: 'ప్రజాస్వామ్యం అంటే ఓటు హక్కో అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం'

By:  Tupaki Desk   |   5 April 2021 6:42 AM GMT
రిపబ్లిక్ టీజర్: ప్రజాస్వామ్యం అంటే ఓటు హక్కో అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం
X
సుప్రీమ్ హీరో సాయి తేజ్‌ - 'ప్రస్థానం' ఫేమ్ దేవ కట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ''రిపబ్లిక్''. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై జె.భగవాన్ - జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'రిపబ్లిక్' టీజర్ ని దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.

'ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండా కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బ్రతుకుతున్నాం' అని సాయి తేజ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా 'ఈ కాలంలో మన జీవితాల నుంచి రాజకీయాలను వేరు చేయలేం' అని జార్జ్ ఆర్వెల్ కొటేషన్ ని గుర్తు చేశారు. 'ప్రజలే కాదు సివిల్ సర్వీసెస్ కోర్టులు కూడా ఆ రూరల్స్ కింద బానిసలల్లానే బతుకుతున్నారు. వ్యవస్థ పునాదులే కరప్ట్ అయినప్పుడు అందరూ కరప్టే' అనే డైలాగ్ ఆలోచింపజేసేలా ఉంది.

ఇందులో సాయి తేజ్ ఐఏఎస్ అధికారి పాత్ర పోషించినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఆయన నటన మరియు డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అలానే రమ్యకృష్ణ పవర్‌ ఫుల్ రాజకీయ నాయకురాలు విశాఖ వాణిగా కనిపిస్తోంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాడు.