Begin typing your search above and press return to search.

రిపబ్లిక్ మూవీని చూశాక కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్

By:  Tupaki Desk   |   4 Oct 2021 3:30 AM GMT
రిపబ్లిక్ మూవీని చూశాక కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్
X
శుక్రవారం వచ్చిందంటే చాలు నాలుగైదు సినిమాలు.. అప్పుడప్పుడు ఏడెనిమిది సినిమాలు కూడా వచ్చే కాలమిది. వారం కంటే ఎక్కువ ఆయుష్షు లేని సినిమా ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. అందుకు భిన్నంగా.. సినిమా చూసిన తర్వాత రోజుల తరబడి.. గుండెల్లో తెలీని అలజడిని రేపి.. మదిలో ఆలోచనల్నిరేపేలా ఉండే సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి.

సినిమాను సినిమాటిక్ గా కాకుండా.. చాలా నిజాయితీగా తీసే దర్శకులు చాలా తక్కువగా ఉంటారు. తాజాగా విడుదలైన రిపబ్లిక్ ఈ కోవలోకి చెందింది.దర్శకుడు దేవ్ కట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాను తాజాగా టీపీసీసీ అధినేత రేవంత్ రెడ్డి చూశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవ్ కట్టా దర్శకత్వం వహించిన ప్రస్థానం మూవీని తాను యూఎస్ లో ఉన్నప్పుడు చూశానని.. తాజాగా ఈ సినిమాను వాస్తవ పరిస్థితులకు తగ్గట్లు తీశారన్నారు. చాలా సినిమాలు ఎండ్ కార్డు పడ్డాక ఏదో ఒక కంక్లూజన్ తో ప్రేక్షకుడు బయటకు వస్తాడని.. కానీ తాను మాత్రం వంద ప్రశ్నలతో.. ఆలోచనలతో బయటకు వచ్చినట్లు చెప్పారు.

‘జరిగిన దాని కంటే చేయాల్సింది ఎంతో ఉంది. ప్రజాస్వామ్యం మెచ్యూర్ కావాలంటే చేస్తున్న పనుల్లోని లోపాల్నిసరిదిద్దుకోవాలి. మంచి పాలనను అందించేందుకు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయి. ఈ చిత్రంలో ఒక ప్రాంతంలోని సమస్యను మాత్రమే చూపించి.. ప్రశ్నలను మాత్రం అన్ని వ్యవస్థలపై వేసినట్లుగా దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా నిర్మాతలకు నష్టమో లాభమో తాను చూడలేదుకానీ.. ప్రజలకు మాత్రం కచ్ఛితంగా ఉపయోగపడుతుందని.. కొద్దిమందిలో అయినా మార్పును తీసుకొస్తుందని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. సాధారణంగా రాజకీయ నేతలు ఎవరైనా సినిమాను చూసినప్పుడు స్పందించే తీరుకు కాస్త భిన్నంగా రేవంత్ మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు.