Begin typing your search above and press return to search.

బాలీవుడ్ - రీమేక్ సినిమాలపై ఆర్జీవీ మార్క్ సెటైర్లు..!

By:  Tupaki Desk   |   26 April 2022 11:30 AM GMT
బాలీవుడ్ - రీమేక్ సినిమాలపై ఆర్జీవీ మార్క్ సెటైర్లు..!
X
ప్రస్తుతం బాలీవుడ్ లో సౌత్ సినిమాల డేమినేషన్ నడుస్తోంది. మన సినిమాలు నార్త్ సర్క్యూట్ లో వందల కోట్లు వసూలు చేస్తుంటే.. హిందీ చిత్రాలు మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోతున్నాయి. మన సినిమాలకు అవి కనీస పోటీని ఇవ్వలేకపోతున్నాయి.

మరోవైపు దక్షిణాదిలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను హిందీలో రీమేక్ చేయడానికి బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. పోటీపడి మరీ భారీ రేట్లకు రీమేక్ రైట్స్ కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ హిందీలో సక్సెస్ అందుకోలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో బాలీవుడ్ పై సెటైర్లు వేశారు. కోవిడ్ వైరస్ మాదిరిగా ఇప్పుడు తెలుగు మరియు కన్నడ చిత్రాలు.. హిందీ చిత్రాలకు సోకాయి. బాలీవుడ్ పరిశ్రమ త్వరలో వ్యాక్సిన్ తో వస్తుందని ఆశిస్తున్నాను అని ఆర్జీవీ పేర్కొన్నారు. #DeathOfRemakes అనే హైష్ ట్యాగ్ తో వరుస ట్వీట్లు చేశారు.

తెలుగులో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''జెర్సీ''. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకుంది. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ తో గౌతమ్ హిందీలో రీమేక్ చేశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

షాహిద్ కపూర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ.. ఒరిజినల్ లో ఉన్న సోల్ మిస్ అయిందని.. తెలుగులో మాదిరిగా మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయిందని కామెంట్స్ వచ్చాయి. దీనికి తగ్గట్టుగానే ఫస్ట్ వీకెండ్ లో వసూళ్ళు ఏమంత ఆశాజనకంగా రాలేదు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు చేశారు.

నాని నటించిన 'జెర్సీ' సినిమాను బాలీవుడ్ లో డబ్ చేసి ఉండుంటే.. నిర్మాతలకు 10 లక్షలు మాత్రమే ఖర్చు అయ్యేది. అలా కాదని దీన్ని హిందీలో రీమేక్ చేసినందుకు నిర్మాతలకు ఏకంగా రూ. 100 కోట్లు వరకూ నష్టం వచ్చింది. దీని వల్ల డబ్బు, సమయం, శ్రమ వృధా అయ్యాయి' అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.

'జెర్సీ' డిజాస్టర్ బాలీవుడ్ కు డెత్ ఆఫ్ రీమేక్స్ అనే సంకేతాన్ని అందిస్తోంది. KGF2 - పుష్ప - RRR లాంటి డబ్బింగ్ సినిమాలు బాలీవుడ్ ఒరిజినల్ సినిమాల్ని మించి భయంకరమైన విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు కంటెంట్ మరియు ప్రాంతీయ స్టార్స్ కూడా హిందీ ప్రేక్షకులకు నచ్చుతున్నాయి కాబట్టి.. ఇకపై మంచి కంటెంట్ ఉన్న ఏ దక్షిణాది సినిమా రీమేక్ హక్కులు విక్రయించబడవు అని ఆర్జీవీ అభిప్రాయ పడ్డారు.

బాలీవుడ్ కు ఇప్పుడు సూపర్ హిట్లు ఎలా తీయాలో తెలియడం లేదు. అలానే దక్షిణాది చిత్రాలను రీమేక్ చేయడం వల్ల మనుగడ సాగించలేకపోతున్నారు. కాబట్టి బాలీవుడ్ ఇప్పుడు రెండు విధాలా డకౌట్ అవుతుంది. #DeathOfRemakes అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

''మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే.. డబ్బింగ్ చిత్రాలను రీమేక్ చేయడానికి బదులు వాటిని నేరుగా విడుదల చేయడం తెలివైన పని. ఎందుకంటే ప్రేక్షకులు ఇప్పుడు ఎక్కడి నుండైనా నటీనటులు ఎవరైనా.. సబ్జెక్ట్ ఏదైనా ఓకే చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది'' అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.