Begin typing your search above and press return to search.

వర్మ ఎవరికీ అర్థం కాడు: చెల్లెలు విజయలక్ష్మి

By:  Tupaki Desk   |   1 March 2022 9:30 AM GMT
వర్మ ఎవరికీ అర్థం కాడు: చెల్లెలు విజయలక్ష్మి
X
రామ్ గోపాల్ వర్మ .. ఒకప్పుడు పోస్టర్ పై ఈ పేరు కనిపిస్తే చాలు జనాలు థియేటర్స్ కి వెళ్లిపోయారు. హీరో .. హీరోయిన్ ఎవరనేది పోస్టర్ పై చూసి థియేటర్లకి వెళ్లే జనాలు, ఒక దర్శకుడి పేరు చూసి సినిమాకి వెళ్లడమనేది దాదాపు వర్మతోనే మొదలైందని చెప్పచ్చు. ఆయన నుంచి చాలా ఫ్లాపులు వచ్చినప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు' పరాజయాలకు అతీతమైన క్రేజ్ ను వర్మ సంపాదించుకోవడానికి కారణం .. ఆయన ఆలోచనా విధానం.

'నేను ఇంతే .. ఎవరి కోసం మారాల్సిన అవసరం లేదు .. నా కోసం మారమని నేను ఎవరినీ అడగను' అనేదే ఆయన స్లోగన్ లా అనిపిస్తుంది.

వర్మ అభిప్రాయాలు .. అభిరుచులు అందరికీ నచ్చవు. ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడానికి ఎవరూ సిద్ధంగా కనిపించరు. కానీ ఆయన ఏం చెబుతున్నాడు? అనే విషయాన్ని తెలుసుకోవడానికి మాత్రం ఆసక్తిని కనబరుస్తుంటారు.

అందువల్లనే ఆయన ఎప్పుడూ ఏదో ఒక ఛానల్ లో కనిపిస్తూనే ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో వర్మ చెల్లెలు విజయలక్ష్మి ఆయన గురించి మాట్లాడారు. "నలుగురు వెళ్లే దారిలో కాకుండా వర్మ అడ్డంగా వెళుతున్నాడని ఆ కుటుంబ సభ్యురాలిగా నాకు ఎప్పుడూ అనిపించలేదు. తను టీవీల్లో ఎంత ధైర్యంగా ఏ విషయాలను గురించి మాట్లాడుతూ ఉంటాడో, బయట కూడా అలాగే ఉంటాడు.

వర్మ ఎవరికీ అర్థం కాడు .. ఆయనను అర్థం చేసుకునేవారు చాలా తక్కువ. నాకు తెలిసి అర్థం చేసుకునేవారిని వ్రేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. తనని అర్థం చేసుకునేవారిని నేను చూడలేదు. తనని అర్థం చేసుకోలేనివారిని కూడా నేను తప్పుపట్టడం లేదు. ఎవరి ఇష్టాలు వారివి .. ఎవరి అభిప్రాయాలు వారివి.

అందువల్లనే తన గురించి నేను ఎవరితో వాదించను .. ఇంతవరకూ నేను ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి కారణం కూడా ఇదే. వర్మకి చిన్నప్పటి నుంచి సినిమాల పిచ్చి ఉంది. ఒక సీన్ కోసం .. ఒక పాట కోసం .. ఒక డ్రెస్ కోసం .. ఒక్కో సినిమాను 15 సార్లు .. 20 సార్లు చూసేవాడు.

తనకి 9 .. 10 ఏళ్లు ఉన్నప్పుడే ఒక సినిమాలో ట్రైన్ బ్లాస్ట్ సీన్ చూసి డైరెక్టర్ ఎక్కడ తప్పు చేశాడో చెప్పేశాడు. అది విని మా మావయ్య ఆశ్చర్యపోయాడు. కొన్ని షాట్స్ చూసి ఆ షాట్ అలా పెట్టి ఉండకూడదు .. ఇలా పెడితే బాగుంటుంది అనేవాడు. మొదటి నుంచి కూడా తను ఎక్కువ మాట్లాడటం .. ఎక్కువ వినడం చేసేవాడు కాదు. తను రెండే ముక్కల్లో చెప్పేస్తాడు .. ఎదుటివాళ్లను కూడా అలాగే చెప్పమంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో తను టైమ్ వేస్టు చేయడు. మెట్లు ఎక్కుతూ వర్క్ చేస్తూనే ఉంటాడు .. బ్లడ్ టెస్టు చేస్తుంటే కూడా వర్క్ చేస్తూనే ఉంటాడు. ఇన్నేళ్ల తన కెరియర్లో తాను బ్రేక్ తీసుకోవడం నేను చూడలేదు" అని చెప్పుకొచ్చారు.