Begin typing your search above and press return to search.

వర్మ పైకి అలా కనిపిస్తాడేగానీ .. తల్లి ఏడిస్తే తట్టుకోలేడట!

By:  Tupaki Desk   |   2 March 2022 3:32 AM GMT
వర్మ పైకి అలా కనిపిస్తాడేగానీ .. తల్లి ఏడిస్తే తట్టుకోలేడట!
X
రామ్ గోపాల్ వర్మ తాను బయటికి చెప్పదలచుకున్న విషయం ఎలాంటిదైనా ఎంత మాత్రం సంకోచించకుండా .. మనసు మూలల్లో ఆ విషయం ఎంతమాత్రం మిగిలిపోకుండా చెప్పేస్తాడు. తాను ఫలానా అంశం తెరపైకి తీసుకుని రావడం వలన అది వివాదాస్పదమవుతుందనే భయం ఆయనలో ఎంతమాత్రం కనిపించదు. తాను అనాల్సింది అనేసి .. చెప్పాల్సింది చెప్పేసి ఆ తరువాత రియాక్షన్ ను ఆయన ఎంజాయ్ చేస్తుంటారు. అంత నిర్మొహమాటంగా వ్యవహరించే ఆయన, బంధాలకు .. అనుబంధాలకు దూరమని తనే చెబుతుంటారు.

దాంతో వర్మకి ఎమోషన్స్ ఉండవు .. ఆయనకి ఎవరిపై ప్రేమ ఉండదు అని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి వర్మకి తన తల్లి అంటే చాలా ఇష్టమట. తన చిన్నప్పటి నుంచి కూడా తల్లి కన్నీళ్లు పెట్టడం ఆయనకి నచ్చేది కాదట. చివరికి తండ్రి చనిపోయి .. తన తల్లి ఏడుస్తుంటే ఆయన తట్టుకోలేకపోయాడట. బంధువులు .. స్నేహితులు ఎవరు వచ్చి పలకరించినా ఆమె ఇంకా ఎక్కువగా ఏడుస్తుండటం చూసి, తండ్రి బాడీని అక్కడి నుంచి తీసుకుని వెళ్లెవరకూ ఎవరినీ లోపలికి రానీయకుండా బయట ఇద్దరు మనుషులను కాపలా ఉంచాడట.

ఇక తల్లితో పాటు సమానంగా వర్మ తనని చూసుకుంటాడని ఆయన చెల్లెలు విజయలక్ష్మి స్వయంగా చెప్పారు. "నాకు ఏదైనా కావాలనిపించినా నేను వర్మను అడిగేదానిని కాదు .. కానీ ఆ విషయాన్ని ఆయన తెలుసుకుని తీసుకుని వచ్చి దానిని నా దగ్గర పెట్టేసి వెళ్లిపోయేవాడు.

అప్పట్లో నాకు రేడియో అంటే చాలా ఇష్టం .. చిన్న రేడియో ఉంటే బాగుంటుంది .. నేనే పెట్టుకుని నేనే వినాలి అనుకునేదానిని. అప్పుడు నాకు 11.. 12 ఏళ్లు ఉంటాయి. ఒక రోజున ఆ రేడియో కిందపడిపోయి పగిలిపోయింది. దాంతో నేను ఏడుస్తూ కూర్చున్నాను.

అప్పుడు వర్మ అక్కడికి వచ్చాడు .. 'రేడియో పగిలిపోతే రిపేర్ చేయించుకోవాలి గానీ .. ఏడిస్తే అతుక్కోదు' అని చెప్పాడు. ఆ రేడియోను రిపేరు చేయించుకుని తీసుకుని వచ్చాడు. ఒక రోజున ఆ రేడియోలో సుశీల గారి పాట వస్తోంది. అప్పుడు వర్మ 'ఏంటి రేడియోలో నుంచి తేనె కారుతోంది' అన్నాడు. దాంతో మేము ఆశ్చర్యపోయి రేడియో దగ్గరికి వెళ్లి చూశాము. 'సుశీలగారు పాడుతుంటే రేడియోలో నుంచి తేనె కారుతున్నట్టుగా ఉంది' అన్నాడు.

అలాంటి స్టేట్మెంట్లు చాలానే ఇస్తూ ఉండేవాడు. తనకి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. తను ఏ విషయాన్ని మరిచిపోవడం నేను చూడలేదు. ఒకవేళ మరిచిపోయానని తను చెబితే మాత్రం అది అబద్ధమే" అని చెప్పుకొచ్చారు.