Begin typing your search above and press return to search.

రాత్రి 10 తర్వాత అది ఆపేశారని తెలంగాణ సర్కార్ పై వర్మ ఫైర్

By:  Tupaki Desk   |   14 Oct 2022 5:57 AM GMT
రాత్రి 10 తర్వాత అది ఆపేశారని తెలంగాణ సర్కార్ పై వర్మ ఫైర్
X
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు, చిత్రనిర్మాత రామ్ గోపాల్ వర్మ సుఖ పురుషుడు.. ఎంజాయ్ పురుషుడు.. సమకాలనీ రాజకీయాలపై స్పందిస్తూ రాజకీయ పార్టీల నేతలపై సెటైర్లు వేస్తుంటారు. మధ్యలో గ్యాప్ లో ఆడని సినిమాలు తీస్తూ క్యాష్ చేసుకుంటారు. ఆయన రాత్రి అయితే చాలు మందు,విందులో మునిగితేలుతుంటారు. అయితే తాజాగా రాత్రి 10 గంటల తర్వాత పబ్ లలో సంగీతం వినడానికి వీల్లేదని బంద్ చేయడంతో వర్మ నొచ్చుకున్నాడు. "నగరం తాలిబాన్ పాలనలో ఉందా" అని ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు. హైదరాబాద్ పబ్‌లలో సంగీతం బంద్ చేస్తున్నారని ఇది తాలిబన్ ప్రభుత్వమా? అని ప్రశ్నించారు.

గురువారం హైదరాబాద్ తాలిబాన్ హ్యాష్‌ట్యాగ్‌తో వరుస ట్వీట్లలో తెలంగాణ ప్రభుత్వం, నగర పోలీసులను ట్యాగ్ చేస్తూ ఈ పరిమితిని తొలగించాలని రాంగోపాల్ వర్మ కోరారు. ఇలా స్వేచ్ఛకు ఆటంకం కొనసాగితే పెట్టుబడిదారులు బెంగళూరు వంటి నగరాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని వర్మ హెచ్చరించారు. "మనమంతా ఒకే దేశంలో నివసిస్తున్నప్పుడు, హైదరాబాదీలు మాత్రమే తాలిబాన్ పాలనకు ఎందుకు గురవుతున్నారు సార్? దేశంలోని అన్ని చోట్లా సంగీత సమయం రాత్రి 1 గంటల వరకూ ఉంది. హైదరాబాద్‌లో రాత్రి 10 గంటలకు ఎలా బంద్ చేస్తారు" అని ఆయన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును వర్మ ప్రశ్నించడం విశేషం.

"హైదరాబాద్‌ను తాలిబాన్ స్టైల్‌లో పాలిస్తున్నారని నేను గ్రహించలేదు, రాత్రి 10 గంటల తర్వాత సంగీతం బంద్ చేస్తుండడంతో స్మశానవాటికలా కనిపిస్తున్న పబ్‌ని చూసినప్పుడు నాకు అలా అనిపించింది" అని ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ చేశారు. రాత్రి 10 గంటల తర్వాత సంగీతం లేని మొదటి అంతర్జాతీయ గ్లోబల్ సిటీగా హైదరాబాద్ అవతరించిందని ఆయన దుయ్యబట్టారు. "సంగీతం ఆగిపోయినప్పుడు కొంతమంది విదేశీయుల ముఖాల రూపాన్ని మరచిపోలేను.. వారు మమ్మల్ని తాలిబాన్లలా చూస్తున్నారు" అని అతను రాసుకొచ్చాడు. తాలిబాన్ల వలె అనాగరికంగా ప్రవర్తించవద్దు అని సూచించారు.

"మీ ఉద్దేశాలను గౌరవిస్తున్నప్పటికీ, యువత మంచి సమయం గడుపుతున్నప్పుడు ప్రభుత్వం ఏది ఒప్పు.. తప్పు అని ఆలోచించాలని.. తాలిబన్ దృక్పథాన్ని కలిగి ఉండటం యువతను అవమానించడమేనని నేను భావిస్తున్నాను" అని రాష్ట్ర పరిశ్రమ మరియు సమాచార సాంకేతికత శాఖను ట్యాగ్ చేసిన రాంగోపాల్ వర్మ అన్నారు. ఈ మేరకు మంత్రి కె.టి. రామారావు.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ట్యాగ్ చేసి మరీ ప్రశ్నించారు. 'తాలిబనీష్' ఆదేశాల మూలంగా హైదరాబాద్ నుండి బెంగుళూరుకు ముఖ్యమైన విదేశీ, పారిశ్రామిక వ్యక్తులను పంపించేలా చేస్తుంది అని వాళ్లు రాసుకొచ్చారు.

"మేము బాలీవుడ్ కంటే టాలీవుడ్‌ను మరింత అభివృద్ధి చేసాము. హైడ్ గ్రాఫిక్స్, గేమింగ్ టాప్ ప్లేస్‌లో హైదరాబాద్ నెం.1 గమ్యస్థానంగా ఉంది..ఇప్పుడు మేము తాలిబాన్ శైలికి తిరిగి వెళ్తున్నాము." అని వర్మ వరుస ట్వీట్లతో ప్రశ్నించారు. 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ ఇంతగా అభివృద్ధి చెందలేదని.. కానీ ిప్పుడు యావత్‌ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని, ఇప్పుడు 2022లో మనం తాలిబాన్‌లుగా మారుతున్నామని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

హైటెక్ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్ని సౌకర్యాలు కల్పించారు. కనీస వినోద సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవడం ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించారని ఆయన గుర్తు చేశారు. "అభివృద్ధి చెందిన దేశాల నుండి పెట్టుబడిదారులు ఎక్కడికైనా రావాలని ప్రధానంగా అడుగుతారు 1. అంతర్జాతీయ విమానాశ్రయం ఉందా? 2. గోల్ఫ్ కోర్స్ ఉందా? 3. ఎంటర్‌టైన్‌మెంట్ హబ్ ఉందా? 4. నైట్ లైఫ్ ఉందా? 10 తర్వాత వారికి సంగీతం వినిపించదు అంటే ఎవరు వస్తారు ఊహించుకోండి అని వర్మ ప్రశ్నించారు.

"రాత్రి 10 గంటల తర్వాత ఎక్కడైనా సౌండ్ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది, సినిమాలను కూడా సైలెంట్‌గా పిక్చర్ మరియు సౌండ్ లేకుండా ప్లే చేయాలా ?? అన్ని వాహనాలు ఆపివేయాలా ? రాత్రి 10 గంటల తర్వాత వాహనాలను అనుమతించకుండా హైదరాబాద్‌లో బారికేడ్ వేయాలా .. 10 తర్వాత అన్ని విమానాలను నిషేధించాలా ??," అని వర్మ ప్రశ్నించాడు. డ్రమ్స్‌పై కాకుండా డ్రగ్స్‌ను అరికట్టడంపై తెలంగాణ పోలీసులు దృష్టి సారించాలని సూచించారు. పబ్‌ల వద్ద నిఘా ఉంచే పోలీసులు యువత, పబ్‌ల నిర్వాహకులు ఏదో నేరస్తుల్లా ప్రవర్తిస్తున్నారని అన్నారు. "దయచేసి ఒకరు పని నుండి ఇంటికి తిరిగి వచ్చి, ఫ్రెష్ అప్ అయ్యి, దుస్తులు ధరించి, బ్యాక్ బ్రేకింగ్ ట్రాఫిక్‌లో పబ్‌కు చేరుకునే సమయానికి దాదాపు 10PM అవుతుందని, ఆపై సంగీతం ఉండదని అర్థం చేసుకోండి." అని వర్మ నగరవాసుల బాధలను ట్వీట్లలో ప్రశ్నించాడు.

ఈ పబ్ లు ఎంజాయ్ చేసే వాళ్లంతా తమ అంతర్గత భావాలను సోషల్ మీడియా ద్వారా లేదా మరేదైనా పద్ధతిలో చెప్పాలని ఆయన అన్నారు. "అణచివేతను ఎదుర్కొని మౌనంగా ఉన్న ఎవరైనా పోలీసు రాజ్యంలో కాకపోయినా, కనీసం పోలీసు నగరంలో అయినా జీవిస్తారు." అంటూ ఘాటు వ్యాఖ్యలలో వర్మ రెచ్చిపోయారు. మరి వర్మ ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం , పోలీసులు స్పందించి తిరిగి పునరుద్ధరిస్తారా? లేదా? అన్నది చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.