Begin typing your search above and press return to search.

దాని వల్ల పవన్ స్టార్ డమ్ పెరుగుతుందే తప్ప.. తగ్గదు: ఆర్జీవీ

By:  Tupaki Desk   |   31 Dec 2021 12:30 PM GMT
దాని వల్ల పవన్ స్టార్ డమ్ పెరుగుతుందే తప్ప.. తగ్గదు: ఆర్జీవీ
X
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం మీద గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు నియంత్రిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో అంశం హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్' మూవీ రిలీజ్ కు ముందు ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ప్రభుత్వం కావాలని పవన్ ను టార్గెట్ చేయడానికే ఇలాంటి నిర్ణయం తీసుకుందని అభిమానులు - జనసేన కార్యకర్తలు ఆరోపణలు చేశారు. ఏప్రిల్ లో జారీ చేసిన ఈ జీవోపై అప్పటి నుంచి డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇదే విషయాన్ని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తావించగా.. తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవీ.. పలు ఆసక్తికరమైన విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా 'కేవలం పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇది నిజమే అయితే ఎంతవరకు కరెక్ట్ అంటారు?' అని ప్రశ్నించగా.. 'అసలు నేను దాన్ని నమ్మను' అని వర్మ అన్నారు.

''పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అనడం స్టుపిడ్ గా ఉంది. ఎందుకంటే దాని వల్ల పవన్ స్టార్ డమ్ పెరుగుతుందే తప్ప.. ఏమాత్రం తగ్గదు. పవన్ కు డబ్బులు రాకుండా చేయడానికే ఇలా చేశారు అనుకుంటే.. దీని వల్ల పవన్ కు వచ్చే డబ్బులు ఏమీ తగ్గవు'' అని రామ్ గోపాల్ వర్మ చెప్పారు.

''మిగతా అందరి డబ్బుల్లో కోత విధిస్తారేమో కానీ.. స్టార్ హీరోలకు ఇచ్చే మనీ ఎప్పుడూ తగ్గదు. ఎందుకంటే వారి మూలంగానే జనాలు థియేటర్లకు వస్తున్నారు కాబట్టి. స్టార్ కు వచ్చే 100 కోట్లలో 80 - 60 కోట్లు మాత్రమే వస్తదనేది జరగదు'' అని వర్మ చెప్పుకొచ్చారు.

సినిమా టికెట్ రేట్ల మీద ఆర్జీవీ మాట్లాడుతూ.. 'సామాన్యులకు తక్కువ ధరకు వచ్చేది ఏదైనా ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. కానీ లాజికల్ గా ఆలోచిస్తే ఒక వస్తువును తయారు వ్యక్తి ఎంత ప్రైజ్ పెడతాడు అనేది ఆ అతని ఇష్టమై ఉండాలి. దాన్ని కొనుక్కోవాలా? లేదా? అనేది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏంటో.. ఎవరి ప్రయోజనం కోసమనేది నాకు తెలియదు' అని అన్నారు.