Begin typing your search above and press return to search.

పొరుగింటి మహిళపై చర్య తీసుకోవాలని సీబీఐ ని కోరిన రియా...!

By:  Tupaki Desk   |   12 Oct 2020 5:30 PM GMT
పొరుగింటి మహిళపై చర్య తీసుకోవాలని సీబీఐ ని కోరిన రియా...!
X
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ కాబడిన హీరోయిన్ రియా చక్రవర్తి.. 28 రోజుల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత ఇటీవల బెయిల్‌ పై విడుదలైంది. సుశాంత్ మరణం కేసులో రియా మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సుశాంత్ మరణించాడనికి ముందురోజు సాయంత్రం సమయంలో సుశాంత్ రియా చక్రవర్తిని తన ఇంటి వద్ద డ్రాప్ చేసి వెళ్లాడని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షి ఉన్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రియా పొరుగింటిలో ఉండే డింపుల్ తవాని అనే మహిళ ఇచ్చిన స్టేట్‌మెంట్ బాగా సంచలనం అయింది. డింపుల్ రిపబ్లిక్ టీవీతో మాట్లాడుతూ.. జూన్ 13న రియా, సుశాంత్ కలిసి ఉన్నారని.. సాయంత్రం 6 - 6.30 గంటల మధ్య సుశాంత్ రియాను తన ప్లాట్ వద్ద వదిలి వెళ్లాడని ప్రత్యక్ష సాక్షి చెప్పారని చెప్పింది. ఈ నేపథ్యంలో పొరుగింటి మహిళపై చర్య తీసుకోవాలని రియా చక్రవర్తి సీబీఐ ని కోరినట్లు తెలుస్తోంది.

డింపుల్‌ తవానీ ఈ కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి.. నాపై చాలా తప్పుడు మరియు అసత్యమైన ఆరోపణలు చేసారని రియా సీబీఐ కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రిపబ్లిక్ టీవీ ఛానెల్‌ లో ఎటువంటి ఆధారాలు లేకుండా ఆమె చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని.. ఐపీసీ సెక్షన్ 203 (తప్పుడు సమాచారం ఇవ్వడం) మరియు 211 (గాయపరిచే ఉద్దేశంతో చేసిన తప్పుడు అభియోగం) కింద ఆమెపై చర్యలు తీసుకోవాలని రియా సిబిఐకి రాసిన లేఖలో కోరింది. ఇంతకముందు రియా తరపు న్యాయవాది సతీష్ మనేషిండే 'టీవీ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చిన వారందరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సీబీఐ అభ్యర్థిస్తున్నామ'ని పేర్కొన్నారు. అలాంటి వారితో కూడిన జాబితాను సీబీఐకి అందచేస్తామని ప్రకటించాడు. ఆయన మాట్లాడిన మరుసటి రోజే రియా చక్రవర్తి.. పొరుగింటి మహిళపై సీబీఐ కి ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా సీబీఐ ఎదుట హాజరైన డింపుల్‌ తవానీ మాట మార్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో సీబీఐ ఆమెకు వార్నింగ్ ఇచ్చిందని.. ఆధారాలు లేకుండా మాట్లాడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డింపుల్‌ ను హెచ్చరించినట్టు జాతీయ మీడియా వెల్లడించింది.