Begin typing your search above and press return to search.

రియా అరెస్టులో ట్విస్ట్...ఎన్సీబీ అధికారులపై సంచలన ఆరోపణలు

By:  Tupaki Desk   |   10 Sep 2020 10:10 AM GMT
రియా అరెస్టులో ట్విస్ట్...ఎన్సీబీ అధికారులపై సంచలన ఆరోపణలు
X
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అతడి ప్రియురాలు రియా చక్రవర్తిపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సుశాంత్ సూసైడ్ మిస్టరీలో డ్రగ్స్ కోణం రావడంతో...రియాను విచారణ జరిపిన ఎన్ సీబీ అధికారులు...డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ 8వ తేదీన రియాను అరెస్ట్ చేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలన్న రియా పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు ఆమెకు 14 రోజుల కస్టడీ విధించింది. ముంబైలోని బైకులా జైలులో ఉన్న రియా...సెప్టెంబర్ 22 వరకు ఎన్సీబీ అధికారులు కస్టడీలో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా రియా కుటుంబ సభ్యులు మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ కేసులో రియాను ఇరికించారని, బలవంతంగా రియా నేరం అంగీకరించేలా ఎన్ సీీబీ అధికారులు ప్రవర్తించారని రియా తరఫు న్యాయవాది సతీష్ మాన్‌షిండే బెయిల్ పిటిషన్ లో వెల్లడించారు.

దీంతోపాటు ఎన్సీబీ అధికారులపై సతీష్ సంచలన ఆరోపణలు చేశారు. రియా విచారణ సమయంలో సుప్రీం మార్గదర్శకాలను ఎన్సీబీ అధికారులు పాటించలేదని, రియా విచారణ సమయంలో మహిళా అధికారి లేరని ఆరోపించారు. స్త్రీలను విచారణ జరిపేటపుడు మహిళా ఆఫీసర్లు, మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఉండాలన్న నిబంధనను ఎన్సీబీ అధికారులు పాటించలేదన్నారు. రియా తాజా బెయిల్ పిటిషన్ పై ప్రత్యేక న్యాయస్థానం గురువారం నాడు విచారణ జరపనుంది. తాజా పిటిషన్ ను పరిగణలోకి తీసుకొని కోర్టు రియాకు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తమపై రియా కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై ఎన్సీబీ అధికారుల స్పందన ఎలా ఉండబోతోందన్నది చర్చనీయాంశమైంది