Begin typing your search above and press return to search.

జైలు నుంచి రియా విడుదల.. వైరల్ అవుతున్న దృశ్యాలు...!

By:  Tupaki Desk   |   7 Oct 2020 3:00 PM GMT
జైలు నుంచి రియా విడుదల.. వైరల్ అవుతున్న దృశ్యాలు...!
X
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ రియా చక్రవర్తికి నేడు(బుధవారం) బాంబే హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్‌ వ్యవహారంలో సెప్టెంబర్‌ 8న రియాని అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. ఆమెను ముంబై బైకుల్లా జైలులో ఉంచారు. షరతులతో కూడిన బెయిల్ రావడంతో దాదాపు నెలరోజుల పాటు జైలులో ఉన్న రియాను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. బైకుల్లా జైలు నుంచి ఆమె కారులో బయలుదేరి ఇంటికి చేరుకున్నారు. దీనికి సబంధించిన వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

రియా విడుదల అవుతున్న నేపథ్యంలో ముంబై పోలీసులు మీడియాను హెచ్చరించారు. ముంబై డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ సంగ్రామ్ సింగ్ నిశాందర్ మాట్లాడుతూ ''మీరు ప్రముఖుల వాహనాల్ని ఛేజ్‌ చేయకూడదు. వారినే కాదు ఇంటర్వ్యూల పేరుతో న్యాయవాదుల్ని కూడా వెంటాడకూడదు. మీ జీవితాల్ని.. సదరు సెలబ్రిటీల జీవితాన్ని.. రోడ్డుపై తిరిగే ఇతరుల జీవితాల్ని అపాయంలోకి నెట్టకూడదు. అది నేరం. ఇలా చేస్తే డ్రైవర్‌ పైనే కాకుండా ఇలాంటి చర్యలకు ప్రేరేపించిన వారిపై కూడా ఎంవీ చట్టం ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం'' అని పేర్కొన్నారు. రియా ఎన్సీబీ విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన సమయంలో మీడియా ప్రతినిధులు ఆమె చుట్టూ గుమిగూడి ప్రవర్తించిన తీరుపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి.

కాగా, బాంబే హైకోర్టు లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసి పలు షరతులు విధించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టంచేస్తూ రియా పాస్‌ పోర్ట్‌ ని అప్పగించాలని ఆదేశించింది. ఒకవేళ గ్రేటర్ ముంబై దాటి వెళ్లాల్సి వస్తే కేసు విచారణ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని.. ప్రయాణానికి సంబంధించిన వివరాలు ముందుగానే తెలియజేయాలని షరతులు విధించింది. ఈ కేసులో సాక్షులను కలవకూడదని.. దర్యాప్తుని సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించకూడదని.. ప్రతీ పది రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్‌‌ లో హాజరు కావాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.