Begin typing your search above and press return to search.

నీతూ - రిషి కపూర్‌ ప్రేమ ప్రయాణం...!

By:  Tupaki Desk   |   30 April 2020 1:49 PM GMT
నీతూ - రిషి కపూర్‌ ప్రేమ ప్రయాణం...!
X
నీతూ - రిషి కపూర్‌... బాలీవుడ్‌ జంటల్లో అన్యోన్యమైన జంటగా పేరొందారు. 'రఫూ చక్కర్‌' 'దో దూని చార్‌' 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' 'దూస్రా ఆద్మీ' 'అంజానే మే' 'ధన్‌ దౌలత్‌' 'ఖేల్‌ ఖేల్‌ మే' 'జిందా దిల్‌' 'జరీలా ఇన్సాన్‌' వంటి అనేక సినిమాల్లో జోడీగా నటించారు. 1980లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు రిషి కపూర్‌ - నీతూ జంట. వీరికి కుమార్తె రిధిమా కపూర్‌ సాహ్ని.. కుమారుడు రణ్‌ బీర్‌ కపూర్‌ ఉన్నారు. కుటుంబం కోసం చాలా కాలం నటనకు దూరమైన నీతూ.. 'బేషరమ్‌' 'లవ్‌ ఆజ్‌ కల్‌' వంటి చిత్రాల్లో భర్తతో కలిసి తెరపై కనిపించారు. రిషి కపూర్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో నీతూ సింగ్‌ తో ప్రేమలో పడిన విషయాన్ని పంచుకున్నారు. ''నాకు దూరమైన గర్ల్‌ ఫ్రెండ్‌ ని నేను మళ్లీ తిరిగి నా జీవితంలోకి తీసుకువచ్చేందుకు నీతూ సహాయం కోరాను. నా ప్రేయసికి ఉత్తరాలు రాయడంలో నీతూ నాకెంతగానో సాయం చేసింది. 'జరీలా ఇన్సాన్‌' సినిమా షూటింగ్‌ సమయంలో ఇది జరిగింది. రోజులు గడిచే కొద్దీ నాకో విషయం అర్థమైంది. నీతూని మిస్సవుతున్నా అనిపించింది. యూరప్‌లో షూటింగ్ చేస్తున్నపుడు తనకు ఒక టెలిగ్రాం ఇచ్చాను. నేను తన గురించి ఆలోచిస్తున్నా అని చెప్పాను’’ అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న నీతూ మాత్రం రిషి చెప్పినట్టు తమ ప్రయాణం సాఫీగా మొదలుకాలేదని... షూటింగ్‌ తొలినాళ్లలో రిషి తనను బాగా ఏడిపించారని చెప్పుకొచ్చారు. తన మేకప్‌, దుస్తులపై కామెంట్లు చేసేవారని.. దాంతో ఆయనపై కోపంగా ఉండేదాన్నని చెప్పారు. రిషి ఒక తుంటరి, ఆకతాయి అని.. అందరినీ ఇలాగే ఆటపట్టించేవారని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో తనకు తెలియకుండానే ఆయన ప్రేమలో పడిపోయానని.. సైన్‌ చేసిన చిత్రాల షూటింగ్‌ ముగిసిన తర్వాత పెళ్లి చేసుకున్నామని తెలిపారు. లుకేమియాతో తాను ఆస్పత్రిలో చేరిన సమయంలో భార్య నీతూ తనలో ధైర్యం నింపిందని... తన కుటుంబం వల్లే కాన్సర్‌ ను జయించగలిగే నమ్మకం వచ్చిందని రిషి అనేక మార్లు చెప్పారు. అదే విధంగా నీతూ సైతం ప్రతీ సందర్భంలోనూ భర్త వెంటే ఉండేవారు. ప్రస్తుతం ఆయన శాశ్వత నిద్రలోకి జారుకోవడంతో నీతూ శోక సంద్రంలో మునిగిపోయారు. కాగా న్యూయార్క్‌లో కాన్సర్‌ చికిత్స పొందిన రిషి కపూర్‌ కొన్ని రోజుల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ముంబై ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. ఆయన మరణంతో తీవ్ర దిగ్రాంతికి లోనైన సినీ రాజకీయం ప్రముఖులు, అభిమానులు ఆయనకు సంతాపం ప్రకటించారు.