Begin typing your search above and press return to search.

తండ్రి జయంతి నాడు ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసిన రితేష్ దేశ్‌ ముఖ్...!

By:  Tupaki Desk   |   27 May 2020 11:30 PM GMT
తండ్రి జయంతి నాడు ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసిన రితేష్ దేశ్‌ ముఖ్...!
X
రితేష్ దేశ్ ముఖ్ 'తుఝే మేరీ కసమ్' సినిమాతో బాలీవుడ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫ్యామిలీ మ్యాన్ తరహా పాత్రలు మరియు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. రితేష్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావు దేశ్ ముఖ్ తనయుడు. మహరాష్ట్రకు రెండు పర్యాయాలు సీఎంగా పని చేసిన విలాస్ రావ్ దేశ్ ముఖ్ కేంద్ర కేబినెట్‌లోనూ పని చేశారు. కాగా విలాస్ రావు దేశ్ ముఖ్ అనారోగ్యం బారిన పడి అవయవాలు దెబ్బతినడంతో 2012లో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇవాళ తండ్రి జయంతి కావడంతో రితేశ్ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. దీనికి సంబంధించిన టిక్ టాక్ వీడియోని రితేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ఈ వీడియోలో ఇంట్లో హ్యాగర్‌ కు తగిలించిన ఉన్న తండ్రికి ఎంతో ఇష్టమైన కుర్తాలో ఓ చేయి ఉంచి.. ఆ చేయిని తన తలపైనా భుజంపైనా వేసుకుని తండ్రి స్వయంగా వచ్చి తనను హత్తుకున్నట్టుగా రితేశ్ ఫీలైన విధానం అందరినీ ఎమోషనల్ చేస్తోంది. తండ్రి వచ్చి తనను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నట్టు భావిస్తూ రితేశ్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ వీడియోని షేర్ చేస్తూ ''హ్యాపీ బర్త్ డే పప్పా... నిన్ను ప్రతిరోజూ మిస్‌ అవుతున్నా'' అని రితేష్‌ ట్వీట్‌ చేశారు. బ్యాగ్రౌండ్ లో 'అగ్నిపత్‌' సినిమాలోని ‘అభి ముజ్‌ మే కహీ..’ అంటూ సాగే సాంగ్ వినిపిస్తోంది. రితేష్ ఫీలింగ్‌ కు తగ్గట్టుగా ఆ పాట సాగడంతో ఆ వీడియో చూసిన వారందరికి కన్నీళ్లు పెట్టిస్తోంది. రితేష్ పోస్టు చేసిన వీడియోను చూసిన అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు ట్వీట్లు చేశారు.

సునీల్ శెట్టి అభిషేక్‌ బచ్చన్‌ సందీప్ కిషన్ దేవిశ్రీ ప్రసాద్‌ మంచు లక్ష్మి ఆయుష్మాన్ ఖురానా తదితరులు కామెంట్లు చేశారు. జెనీలియా కూడా మామయ్యను సోషల్‌ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు. ''మీరే మా గర్వకారణం. మీరున్న భావన ప్రతి రోజూ కలుగుతోంది. మీరు ఎక్కడ ఉన్నా సరే మమ్మల్ని సంరక్షిస్తుంటారని తెలుసు. మీరు మాలోనే ఉన్నారు.. హ్యాపీ బర్త్‌డే'' అని పోస్ట్‌ చేశారు. కాగా జెనీలియా - 'తుఝే మేరీ కసమ్' (తెలుగులో 'నువ్వే కావాలి') సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాతో స్నేహితులుగా మారిన ఈ జంట ఆ తర్వాత రోజుల్లో ప్రేమికులుగా మారారు. పదేళ్ల పాటు ప్రేమికులుగా కొనసాగిన తర్వాత 2012లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.