Begin typing your search above and press return to search.

చైనాలో నైనా మన సినిమా బాక్స్‌ లు బద్దలు కొట్టేనా?

By:  Tupaki Desk   |   14 Aug 2019 4:40 AM GMT
చైనాలో నైనా మన సినిమా బాక్స్‌ లు బద్దలు కొట్టేనా?
X
భారీ అంచనాల నడుమ హాలీవుడ్‌ స్థాయి టెక్నాలజీతో తెరకెక్కిన '2.ఓ' చిత్రం ఇండియన్‌ సినీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే విషయం తెల్సిందే. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 2.ఓ చిత్రం విజువల్స్‌ పరంగా వండర్స్‌ ను క్రియేట్‌ చేసింది. అయితే కలెక్షన్స్‌ మాత్రం అంతగా రాబట్టలేక పోయింది. ఇండియాలో ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధించలేక పోయిన 2.ఓ చిత్రాన్ని చైనాలో విడుదల చేయాలని మొదటి నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా చైనాలో మంచి విజయాన్ని నమోదు చేస్తుందని లైకా ప్రొడక్షన్స్‌ వారు నమ్మకంగా ఉన్నారు.

గత నెలల్లోనే 2.ఓ చిత్రాన్ని చైనాలో విడుదల చేయాలని భావించారు. కాని ఆ సమయంలో హాలీవుడ్‌ సినిమా విడుదల అయిన కారణంగా వాయిదా వేశారు. తాజాగా చైనాలో 2.ఓ చిత్రం కొత్త విడుదల తేదీని లైకా ప్రొడక్షన్స్‌ అధికారికంగా ప్రకటించింది. చైనాలో రికార్డు స్థాయి థియేటర్లలో ఈ చిత్రంను విడుదల చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఏ విదేశీ సినిమా కూడా చైనాలో విడుదల కానన్ని థియేటర్లలో 2.ఓ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

47 వేలకు పైగా త్రిడి స్క్రీన్‌ లలో ఈ చిత్రంను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. సెప్టెంబర్‌ 6వ తేదీన ఈ చిత్రం చైనా ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతుంది. రజినీకాంత్‌ హీరోగా అక్షయ్‌ కుమార్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌ గా అమీ జాక్సన్‌ నటించింది. ఇండియాలో వెయ్యి కోట్లు వసూళ్లు చేస్తుందని ఆశించారు. అయితే 800 కోట్ల వరకు ఈ చిత్రం రాబట్టిందని తెలుస్తోంది. ఇండియాలో ఆశించిన స్థాయిలో రాబట్టలేక పోయిన 2.ఓ చిత్రం చైనాలో అయినా బాక్స్‌ లు బద్దలు కొడుతుందేమో చూడాలి.