Begin typing your search above and press return to search.

రోజా నీకు సరిలేరు ఎవరు..

By:  Tupaki Desk   |   24 March 2020 6:43 AM GMT
రోజా నీకు సరిలేరు ఎవరు..
X
నాయకులు చాలామందే ఉంటారు కానీ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం మాత్రం కొందరికే దక్కుతుంది. అలాగే ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గానికి ఒకరుంటారు.. కానీ వారిలో అందరికీ తెలుగు ప్రజల్లో క్రేజ్ ఉండదు. చాలా తక్కువమందికి మాత్రమే అలా క్రేజ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం వైసీపీ విషయం తీసుకుంటే మహిళా ఎమ్మెల్యేలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. వారిలో అందరికంటే క్రేజ్ ఎవరికీ ఎక్కువ ఉంది? ప్రజల్లో ఏ మహిళా ఎమ్మెల్యే పట్ల ఎక్కువ అదరణ ఉంది అంటే రోజా మేడమ్ అని పాఠకులు నిర్ద్వందంగా తేల్చారు.

పోయినసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఎపీ సీఎమ్ జగన్ మోహన్ రెడ్డిని కొందరు మహిళా ఎమ్మెల్యేలు సినిమా డైలాగులతో ప్రశంసించారు. కొందరైతే విపరీతంగా జగనన్నను పొగిడారు. ఆ క్లిప్పింగులను తమ సోషల్ మీడియా టీమ్స్ ద్వారా ప్రచారం చేయించుకుంటూ తమకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉందనే అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నించారు. అయితే చాలామంది సాధారణ ప్రజలకు ఆ ఎమ్మెల్యేలు ఎవరో సరిగా తెలియదని సోషల్ మీడియాలో కొన్ని అభిప్రాయాలు వినిపించాయి. ఈ సందర్భంగా మేము వైసిపీ మహిళా ఎమ్మెల్యేలలో భారీ అదరణ ఉన్నవారు ఎవరు అని ఒక పోల్ నిర్వహించాము.

"ప్రజల్లో క్రేజ్ ఉన్న వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఎవరు?" అనే ప్రశ్నకు రోజా మేడమ్ కు 52 శాతానికి పైగా ఓట్లు లభించాయి. రెండవ స్థానంలో ఉన్న ఎమ్మెల్యేకి మూడోవంతు ఓట్లు కూడా లభించకపోవడం గమనార్హం. మిగతా ఎమ్మెల్యేలు ఇతరులు రాసి ఇచ్చిన పంచ్ లు.. డైలాగులు చదివి ప్రజలను మెప్పించే ప్రయత్నం చేస్తారని.. అదే రోజా మాత్రం సమయానికి సందర్భానికి తగినట్టు మాట్లాడతారని.. అంతే కాకుండా ప్రతిపక్షం ఊపిరిసలుపుకోనివ్వకుండా దాడి చెయ్యడం రోజాకు వెన్నతో పెట్టిన విద్య అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

కొందరు విమర్శకులు రోజాకు సినిమా క్రేజ్ ఉంది కాబట్టి అదే రాజకీయాల్లో కొనసాగుతుందనే అంటారు కానీ రోజా కాకుండా ఎంతోమంది నటీనటులు ఎమ్మెల్యేలు గా ఉన్నారు వారికి ప్రజల్లో రాజకీయ నాయకులుగా ఏపాటి క్రేజ్ ఉందో చూస్తే మనకు వాస్తవం బోధపడుతుందని అంటున్నారు. రోజా ఓ పరిణతి చెందిన రాజకీయ నాయకురాలిగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నారని.. వారి అభిమానం సంపాదించారని ప్రశంసలు కురిపిస్తున్నారు.