Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : రౌడీ బాయ్స్

By:  Tupaki Desk   |   15 Jan 2022 5:25 AM GMT
మూవీ రివ్యూ : రౌడీ బాయ్స్
X
చిత్రం : 'రౌడీ బాయ్స్'

నటీనటులు: ఆశిష్-అనుపమ పరమేశ్వరన్-విక్రమ్ సహదేవ్-జయప్రకాష్-శ్రీకాంత్ అయ్యంగార్-కార్తీక్ రత్నం-తేజ్ కూరపాటి తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: మది
నిర్మాతలు: రాజు-శిరీష్
రచన-దర్శకత్వం: హర్ష కొనుగంటి

టాలీవుడ్లోకి కొత్తగా మరో వారసుడు అడుగు పెట్టాడు. అతనే ఆశిష్ రెడ్డి. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడైన ఈ కుర్రాడు కథానాయకుడిగా పరిచయమైన సినిమా.. రౌడీ బాయ్స్. ‘హుషారు’ ఫేమ్ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అక్షయ్ (ఆశిష్ రెడ్డి) ఒక ఈజీ గోయింగ్ కుర్రాడు. అప్పుడే బీటెక్ లో చేరిన అతను.. తన కాలేజీకి పక్కనే ఉండే మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్న కావ్య (అనుపమ పరమేశ్వరన్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కొన్ని రోజులు వెంట పడ్డాక అక్షయ్ పట్ల కావ్య కూడా ఆకర్షితురాలవుతుంది. కానీ ఆమెను అప్పటికే ప్రేమిస్తున్న తన క్లాస్ మేట్ విక్రమ్ (విక్రమ్ సహదేవ్)కు అక్షయ్ పట్ల ద్వేషం పెరుగుతుంది. ఈ క్రమంలో అతను.. అక్షయ్ ని టార్గెట్ చేస్తాడు. కొన్ని అనూహ్య పరిణామాల తర్వాత అక్షయ్ ప్రేమలో పడ్డ కావ్య తనతో సహజీవనానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో అక్షయ్-కావ్యల జీవితాల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి.. ఇద్దరూ కలిసి ప్రయాణం సాగించారా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

దేవిశ్రీ ప్రసాద్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. మది లాంటి అగ్రశ్రేణి ఛాయాగ్రాహకుడు.. అందం+అభినయం రెండూ అనుపమ పరమేశ్వరన్ లాంటి మంచి హీరోయిన్.. ఇక ప్రమోషన్ల కోసమేమో జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్ లాంటి టాప్ స్టార్లు.. ఇలా దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో ఆశిష్ కోసం ప్యాడింగ్.. ప్లానింగ్ మామూలుగా జరగలేదు. ఐతే ఈ అదనపు హంగులన్నీ ఓకే. కానీ సినిమాకు ఆత్మ అనదగ్గ కథ సంగతేంటి.. దర్శకుడి పనితనం మాటేంటన్నది అన్నింటికంటే కీలకమైన విషయం.

హుషారు లాంటి యూత్ ఫుల్ మూవీతో ఆకట్టుకున్న హర్ష కొనుగంటికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించడం వరకు ఓకే కానీ.. కథల ఎంపికలో.. మేకింగ్ విషయంలో మంచి అభిరుచి కలిగి ఉండి ఎందరో స్టార్లకు పెద్ద హిట్లు ఇచ్చిన దిల్ రాజు.. తన సోదరుడి కొడుకు సినిమాకు ‘రౌడీ బాయ్స్’ లాంటి కథను ఎంచుకోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం. హర్ష తీసిన ‘హుషారు’ హిట్టయింది కదా అని కాలేజ్ లవ్ స్టోరీ అనగానే టెంప్ట్ అయిపోయి ఓకే చేసినట్లుంది తప్ప.. తనకు తాను సెట్ చేసుకున్న బెంచ్ మార్క్ గురించి మాత్రం రాజు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు.

ఎన్నో సార్లు చూసిన రొటీన్ కథ.. మామూలు సన్నివేశాలతో సాగిపోయిన ‘రౌడీ బాయ్స్’ ప్రేక్షకులను నిరాశకే గురి చేస్తుంది. ‘హుషారు’ తరహాలో ప్రథమార్ధంలో వచ్చే కొన్ని క్రేజీ యూత్ ఫుల్ ఎపిసోడ్లు.. హీరో హీరోయిన్ల పెర్ఫామెన్స్.. రొమాన్స్ మినహాయిస్తే ‘రౌడీ బాయ్స్’లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినీ పరిశ్రమలో ఒక పెద్ద కుటుంబం నుంచి ఒక కొత్త హీరో వస్తున్నాడంటే.. అతడి తొలి చిత్రం ఎలా ఉంది అన్నదానికంటే తన పెర్ఫామెన్స్ ఎలా ఉందన్న ఆసక్తే ఎక్కువగా ఉంటుంది ప్రేక్షకుల్లో.

ఈ కోణంలో చూస్తే మాత్రం ఆశిష్ బాగానే ఇంప్రెస్ చేస్తాడు. ‘రౌడీ బాయ్స్’ సర్ప్రైజింగ్ గా అనిపించే విషయం అదే. తొలి సినిమా అన్న ఫీలింగే ఏమాత్రం కనిపించకుండా.. చాలా ఈజ్ తో పెర్ఫామ్ చేశాడు ఆశిష్. అతడి హుషారుకు.. హర్ష ‘హుషారు’తరహాలో క్రేజీ సినిమా తీసి ఉంటే కథ వేరుగా ఉండేది. ఒక కొత్త హీరో.. కథకు.. తన పాత్రకు న్యాయం చేయలేదన్న ఫీలింగ్ సాధారణంగా కలుగుతుంటుంది కానీ.. ఇందులో మాత్రం హీరో టాలెంటుకి తగ్గ కథ.. పాత్ర పడకపోవడమే విచారకరం.

పూర్తి స్థాయిలో కాలేజీ నేపథ్యంలో సాగే కథతో నడుస్తుంది ‘రౌడీ బాయ్స్’. అప్పుడే బీటెక్ లో అడుగుపెట్టే అల్లరి చిల్లరి కుర్రాడిగా హీరో.. అతడిని ఎప్పుడూ తిడుతూ ఉండే తండ్రి పాత్రల పరిచయంతో ఇదొక రొటీన్ మూవీ అన్న ఫీలింగ్ పడిపోతుంది. దీనికి తోడు హీరో బైక్ లో వెళ్తూ బస్సులో అమ్మాయిని చూడటం.. బైక్ దిగి తనను ఫాలో అయిపోవడం.. తొలి చూపులోనే లవ్ లెటర్ ఇవ్వడం లాంటి సన్నివేశాలు మరింత మూసగా అనిపిస్తాయి.

ఐతే దాని తర్వాత వచ్చే ఒక క్రేజీ యాక్షన్ ఎపిసోడ్ చూస్తే దర్శకుడు హర్ష ‘హుషారు’ తరహాలోనే సినిమాను క్రేజీగా నడిపించబోతున్నాడనిపిస్తుంది. ఇంజినీరింగ్ కుర్రాడు..మెడికల్ కాలేజీ అమ్మాయిని ప్రేమించడం.. అది రెండు కాలేజీల స్టూడెంట్స్ మధ్య గొడవగా మారడం.. ఈ క్రమంలో సినిమా ఓ మోస్తరుగానే కాలక్షేపం చేస్తుంది. చివరికి హీరో హీరోయిన్ మనసు గెలిచే వరకు ‘రౌడీ బాయ్స్’ మంచి జోష్ తోనే సాగుతుంది. ప్రథమార్ధం హై ఇవ్వకపోయినా.. నిరాశకైతే గురి చేయదు.

కానీ ఇంటర్వెల్ సమయానికి వచ్చిన ఊపును ద్వితీయార్ధంలో దర్శకుడు కొనసాగించలేకపోయాడు. హీరో హీరోయిన్లు ఒక గూటికి చేరాక ‘రౌడీ బాయ్స్’ రొటీన్ బాట పడుతుంది. ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు.. అలకలు.. ప్రేమలు.. ఇవన్నీ మామూలుగా అనిపిస్తాయి. అనుపమను ఇప్పటిదాకా ఎన్నడూ చూడనంత హాట్ గా చూపించి తనతో మూడు లిప్ లాక్స్ కూడా చేయించడం ద్వారా కుర్రకారును కొంత ఎంగేజ్ చేసినా.. కథ పరంగా మాత్రం నిరాశ తప్పదు. హీరో హీరోయిన్ల మధ్య ఎడబాటుకు దారి తీసే సన్నవేశాలతో ‘రౌడీ బాయ్స్’ పూర్తిగా గాడి తప్పేసింది. హీరోయిన్ కోసం హీరో త్యాగం చేస్తూ ఆమె మనసు విరిగిపోయేలా చేసే సన్నివేశాలు ఎన్ని వందల సినిమాల్లో చూడలేదు.

ఒక కొత్త హీరోతో.. ఓ యువ దర్శకుడు తీసిన సినిమాలో ఇలాంటి సన్నివేశాలు అస్సలు ఊహించం. చాలా ముందుగానే ఈ కథ ముందుకు సాగి.. ఎలా ముగియబోతుందో అర్థమైపోతుంది. ఎండ్ కార్డ్ పడే వరకు చాలా ఓపికతో ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. సాంకేతిక హంగులు బాగా కుదిరి.. హీరో హీరోయిన్లు బాగా పెర్ఫామ్ చేసిన ఈ చిత్రంలో.. ప్రథమార్ధంలో ఉన్న ఊపు కొనసాగి ఉంటే సినిమా పాసైపోయేది. కానీ కథాకథనాలు ‘మిడిల్ డ్రాప్’ అయిపోవడంతో నిరాశ తప్పదు.

నటీనటులు:

ముందే అన్నట్లు ఈ సినిమాలో పెద్ద సర్ప్రైజ్ ఆశిషే. కెమెరాను ఫేస్ చేయడంలో ఏమాత్రం బెరుకు కనిపించలేదు అతడిలో. అలవాటైన నటుడిలా చాలా సులువుగా లాగించేశాడు తన పాత్రను. ఇక డ్యాన్సుల్లో అయితే ఆశిష్ లైవ్ వైర్ లాగే కనిపించాడు. ఇంకాసేపు చూడాలనిపించేలా స్టెప్పులేశాడు. లుక్స్ పరంగా అతను యావరేజ్ అనిపిస్తాడు. సినిమా సంగతెలా ఉన్నా.. ఆశిష్ మాత్రం మంచి మార్కులే వేయించుకున్నాడు. హీరోయిన్ అనుపమ కూడా చాలా బాగా చేసింది. నటన పరంగా తనెప్పుడూ నిరాశ పరచదు. ఈ సినిమాలో చాలా గ్లామరస్ గా కనిపిస్తూ లిప్ లాక్స్ కూడా చేయడం బోనస్. మరీ బక్క చిక్కడం వల్ల కొన్ని చోట్ల అనుపమలో ఆకర్షణ కనిపించలేదు. నెగెటివ్ రోల్ లో చేసిన విక్రమ్ సహదేవ్ నిరాశ పరిచాడు. తన పాత్రకు అతను న్యాయం చేయలేకపోయాడు. ఈ పాత్రకు రఫ్ గా అనిపించే నటుడిని పెట్టుకోవాల్సింది. ఇంకా పసితనపు ఛాయలు పోకపోవడంతో విక్రమ్ ఆ పాత్రకు మిస్ ఫిట్ అనిపించాడు. శ్రీకాంత్ అయ్యంగార్.. జయప్రకాష్ తమ పాత్రల పరిధిలో నటించాడు. హుషారు ఫేమ్ తేజ్ కూరపాటి.. కార్తీక్ రత్నం ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా ‘రౌడీ బాయ్స్’ టాప్ క్లాస్ అనడంలో సందేహం లేదు. దేవిశ్రీ ప్రసాద్ తన పాటలతో.. నేపథ్య సంగీతంతో మంచి ఊపు తెచ్చాడు. పాటలు అన్నీ కూడా హుషారుగా సాగాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలోనూ దేవి న్యాయం చేశాడు. ఛాయాగ్రామకుడు మది తన స్థాయికి తగ్గ పనితనమే చూపించాడు. విజువల్స్ ఆద్యంతం కలర్ఫుల్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువల విషయంలో అసలేమాత్రం రాజీ పడలేదు. ఒక స్టార్ సినిమా స్థాయిలో ఖర్చు పెట్టారు దిల్ రాజు.. శిరీష్. దర్శకుడు హర్ష కొనుగంటి విషయానికి వస్తే.. తొలి సినిమా తర్వాత తనపై పెరిగిన అంచనాలను అతను అందుకోలేకపోయాడు. హుషారులో మాదిరి క్రేజీగా సినిమాను నడిపించలేకపోయాడు. ప్రేమకథ విషయంలో అందరిలాగే అతనూ ఆలోచించడం నిరాశ కలిగించే విషయం. కొన్ని మెరుపులున్నప్పటికీ.. ఓవరాల్ గా అయితే అతడి పనితనం నిరాశ పరుస్తుంది.

చివరగా: రౌడీ బాయ్స్.. మిడిల్ డ్రాప్

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre