Begin typing your search above and press return to search.

అదే సిరివెన్నెల గొప్పతనం: ఆర్పీ పట్నాయక్

By:  Tupaki Desk   |   7 Dec 2021 10:30 AM GMT
అదే సిరివెన్నెల గొప్పతనం: ఆర్పీ పట్నాయక్
X
టాలీవుడ్ సంగీత దర్శకులలో ఆర్పీ పట్నాయక్ స్థానం ప్రత్యేకం. ఆర్పీ ఎంత మంచి సంగీత దర్శకుడో .. అంతమంచి గాయకుడు కూడా. ఆయన సంగీతాన్ని సమకూర్చిన పాటలు కొన్ని ఆయనే పాడేవారు.

ఎక్కువగా జానపద బాణీలలో స్వరాలను సమకూర్చేవారు. ఆ మధ్య కొన్ని కారణాల వలన సంగీత దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన, మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అలాంటి ఆర్పీ తాజాగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో తనకి గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

"నా ఫస్టు సినిమాకే శాస్త్రిగారితో కలిసి పనిచేసే అవకాశం లభించింది. అయితే కొన్ని కారణాల వలన నేను ఆ సినిమా నుంచి తప్పుకోవలసి వచ్చింది. 'ఎందుకు అలా చేయవలసి వచ్చింది?' అని శాస్త్రిగారు అడిగారు.

'కొన్ని ఎథిక్స్ కోసం గురువుగారూ' అన్నాను. అప్పుడు ఆయన నా వైవు అదోలా చూశారు. నా పై ఆయనకి గల అభిమానం పెరిగింది. నా భుజం పై చేసి వేసి, 'తప్పకుండా నువ్వు చాలా పెద్దవాడివి అవుతావు' అంటూ నన్ను బ్లెస్ చేశారు. నేను అనే కాదు .. ఎవరు ఎథిక్స్ పాటించినా వాళ్లని ఆయన ఎంతో అభిమానిస్తారు. అలాంటివారు వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు.

'మనసంతా నువ్వే' సినిమాకి నేను పనిచేయడం వెనుక శాస్త్రిగారి ప్రోత్సాహం ఉంది. ఆ సినిమా కోసం శాస్త్రిగారితో నేను చేసిన మొదటిపాట 'ఎవరిని ఎప్పుడు' అంటూ సాగుతుంది.

ఈ సినిమా మొత్తానికి కలిసి 'మనసంతా నువ్వే' అనే ట్యూన్ ను నేను ఎమ్మెస్ రాజుగారికి వినిపించాను. ఇది థీమ్ సాంగ్ .. చిన్న బిట్టే అయినా చాలా పెద్ద అర్థంతో శాస్త్రిగారు రాస్తారు అని అన్నాను. 'నీ స్నేహం .. 'అంటూ శాస్త్రిగారు అద్భుతంగా రాశారు. ఆయన రాసినది రెండు లైన్లే .. కానీ అదే ఆ సినిమాకి సోల్ అయింది .. అది శాస్త్రిగారిలో ఉన్న గొప్పతనం.

సాధారణంగా లిరిక్ రైటర్స్ అక్కడ సందర్భం ఏమిటని అడిగి పాట రాస్తుంటారు. కానీ శాస్త్రిగారు ఒక చిన్న బిట్టు రాయవలసి వచ్చినా సినిమా కథ మొత్తం వింటారు. కథ మొత్తాన్ని ఆకళింపు చేసుకునిగానీ ఆయన కలం పట్టుకోరు. పాటలో కథకి సంబంధించి అంశాలను పొందుపరచడానికి ఆయన ప్రయత్నిస్తారు.

ఈ సందర్భానికి నేనేమీ రాయాలి అని కాకుండా ఈ సినిమాకి నేనేమి రాయాలి అని ఆలోచించే పాటల రచయితగా శాస్త్రిగారు కనిపిస్తారు. 'మనసంతా నువ్వే' సినిమాలోని 'కిటకిట తలుపులు' పాట అందుకు ఒక ఉదాహరణ.

ఆ పాటలో 'కంటతడి నాడు .. నేడు, చెంప తడిమిందే చూడు .. చెమ్మలో ఏదో తేడా .. కనిపించలేదా?' అనే లైన్ ను రాశారు. బాధకలిగినప్పుడు హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంటుంది .. అలాగే ఆనందం కలిగినప్పుడు కూడా ఆమె కళ్లు చెమ్మగిల్లుతాయి.

రెండు సందర్భాల్లోనూ చెంపలు తడిశాయి .. కానీ ఆ తడిలో తేడా ఉంది అంటూ ఆయన కేవలం ఒక సన్నివేశాన్ని మాత్రమే కాకుండా, సినిమా కథ అంతటినీ తీసుకుని రాశారు. అంతచక్కగా ఫిలాసఫీని చెప్పగలగడం ఆయన ప్రత్యేకత. ఇలా చెప్పడం ఇంకా ఎవరికైనా సాధ్యమవుతుందా అంటే కాదనే చెప్పాలి" అంటూ తన మనసులోని భావాలను ఆవిష్కరించారు.