Begin typing your search above and press return to search.

ఆర్‌ఆర్‌ఆర్‌ అడ్వాన్స్ బుకింగ్‌ గందరగోళం

By:  Tupaki Desk   |   2 Jan 2022 1:30 PM GMT
ఆర్‌ఆర్‌ఆర్‌ అడ్వాన్స్ బుకింగ్‌ గందరగోళం
X
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 7వ తారీకున రావాల్సి ఉండగా విడుదలకు అయిదు రోజుల ముందు ఒమిక్రాన్ వల్ల వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. సినిమా విడుదల వాయిదా కి కారణం అందరికి తెల్సిందే. సినిమా ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తామంటూ రాజమౌళి మూడు రోజుల క్రితం కూడా ప్రకటించిన నేపథ్యంలో ఓవర్సీస్ లో భారీ ఎత్తున ప్రీమియర్‌ లకు అడ్వాన్స్ బుకింగ్‌ ఇవ్వడం జరిగింది. అమెరికాలో ఏకంగా రెండు మిలియన్ డాలర్ల అడ్వాన్స్ బుకింగ్‌ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా వేలాది మంది ఇప్పటికే ఆర్ ఆర్‌ ఆర్‌ అడ్వాన్స్ బుకింగ్‌ ను చేసుకోవడం జరిగింది. దాదాపుగా 80 శాతం ప్రీమియర్ టికెట్లను అమ్మేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇంతలో సినిమా వాయిదా పడటంతో అడ్వాన్స్ బుకింగ్‌ చేసుకున్న వారి పరిస్థితి గందరగోళంగా మారింది.

సినిమా ప్రిమియర్‌ టికెట్లను ఆన్‌ లైన్ ద్వారా బుక్ చేసుకోవడం ద్వారా టికెట్‌ రేటు కంటే అదనంగా ఆన్ లైన్ పోర్టల్‌ వారు వసూళ్లు చేయడం జరిగింది. ఇప్పుడు అదనంగా ఆన్ లైన్ పోర్టల్ వసూళ్లు చేసిన మొత్తం డిస్ట్రిబ్యూటర్లు చెల్లించేందుకు నో చెబుతున్నారు. టికెట్‌ రేటు మేరకు డబ్బు తిరిగి ఇచ్చే విషయమై ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. రెండు మూడు రోజుల్లో ఈ పక్రియను పూర్తి చేస్తామని బయ్యర్లు చెబుతున్నారు. పెద్ద ఎత్తున బుకింగ్ జరగడంతో వాటన్నింటిని తిరిగి చెల్లించాలంటే చాలా పెద్ద ప్రహసనం గా చెప్పుకుంటున్నారు. ఇండియాలో కూడా ఒకటి రెండు రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు అయ్యేది. ఇంతలో సినిమా వాయిదా పడటంతో అడ్వాన్స్ బుకింగ్‌ ను నిలిపి వేశారు.

రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ లు కలిసి నటించిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా 2020 లో విడుదల అవ్వాల్సి ఉండగా మొదటి సారి షూటింగ్‌ ఆలస్యం అవ్వడం వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత వరుసగా కరోనా వల్ల మూడు సార్లు వాయిదా పడింది. తాజాగా కరోనా థర్డ్‌ వేవ్‌ వల్ల ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ను వాయిదా వేసిన మేకర్స్ ఏప్రిల్‌ లేదా జులై లో విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. నాలుగు ఏళ్లుగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులు మరి కొన్నాళ్ల పాటు ఈ సినిమా కోసం వెయిటింగ్‌ తప్పదు. సోషల్‌ మీడియాలో ఈ సినిమా ను పతాక స్థాయిలో ప్రచారం చేశారు. అభిమానులు.. చిత్ర యూనిట్‌ సభ్యులు సోషల్ మీడియాలో షేర్‌ చేసిన సినిమా వివరాలు అంచనాలను ఆకాశానికి పెంచాయి. ఇలాంటి సమయంలో సినిమా వాయిదా పడటంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సినీ ప్రేమికులకు నిరాశ వ్యక్తం చేశారు. రాజమౌళి మళ్లీ ఒక మంచి తేదీని చూసి విడుదల చేస్తారని ఆశిద్దాం.