Begin typing your search above and press return to search.

RRR ఫైనల్ సాంగ్ షూటింగ్ పూర్తి.. వచ్చే వారం జక్కన్న ప్రెస్ మీట్..?

By:  Tupaki Desk   |   18 Aug 2021 4:30 PM GMT
RRR ఫైనల్ సాంగ్ షూటింగ్ పూర్తి.. వచ్చే వారం జక్కన్న ప్రెస్ మీట్..?
X
యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ''ఆర్ ఆర్ ఆర్''. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఫైనల్ సాంగ్ షూటింగ్ కోసం 'RRR' బృందం ఈ నెల ప్రారంభంలో ఉక్రెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. పదిహేను రోజుల పాటు జరిగిన ఈ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ఈరోజు బుధవారం పూర్తయిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రేపు (ఆగ‌స్ట్ 19) ట్రిపుల్ ఆర్ టీమ్ హైద‌రాబాద్ రాబోతుందట. ఆ వెంట‌నే ఆర్ఎఫ్సీలో నాలుగు రోజులు షూట్ చేసుకోని ఈ సినిమా షూటింగ్ కి గుమ్మ‌డికాయ కొట్టేయ‌బోతున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత విడుద‌ల తేదీని ప్రకటించాలని వెయిట్ చేస్తున్న జక్కన్న అండ్ టీమ్.. ఆగ‌స్ట్ నెలాఖ‌రున దీనికి సంబంధించి ఓ ప్రెస్ మీట్ పెట్టనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ చెబుతూ వస్తున్నారు. అంటే విడుదలకు రెండు నెలల కంటే తక్కువ సమయమే ఉంది. ఇంత తక్కువ టైంలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మరియు ప్రమోషన్స్ చేయగలరా అనేది ప్రశ్నార్థకమే. అందులోనూ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాల్సిన సినిమా కాబట్టి.. ఇతర ఇండస్ట్రీలలో పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

బాలీవుడ్ లో పెద్ద మార్కెట్ గా భావించే మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో థియేటర్లు ఇంకా క్లోజ్ అయ్యే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని భాషల్లో సినిమాని రిలీజ్ చేయడం అంటే సాధ్యం కాని పని. ఇలాంటివి లెక్కలోకి తీసుకుంటే 'ఆర్ ఆర్ ఆర్' మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ తారుమారు అవుతాయని చెప్పవచ్చు.

'RRR' మూవీ ఇప్పటికే రెండు సార్లు విడుదల తేదీ మార్చుకుంది. ముందుగా 2020 జులై 30న‌ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత 2021 జ‌న‌వ‌రి 8న పక్కా థియేటర్లలోకి వస్తామని ప్రకటించారు. అయితే అనివార్య ప‌రిస్థితుల్లో మళ్ళీ వాయిదా వేయాల్సి వచ్చింది. చివరగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని ప్రకటించగా.. ఈసారి కరోనా సెకండ్ వేవ్ ఇబ్బందులు తెచ్చి పెట్టింది. చెప్పిన తేదీకి ట్రిపుల్ ఆర్ ని విడుదల చేయాలని గట్టిగానే ట్రై చేశారు కానీ.. పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని మరోసారి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆగస్టు నెలాఖరున ప్రెస్ మీట్ పెట్టి కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారని టాక్ నడుస్తోంది. అలానే ఇందుకు గల కారణాలను సవివరంగా చెప్పాలని అనుకుంటున్నారట. ఒకవేళ RRR మళ్ళీ వాయిదా పడితే దీని ఎఫెక్ట్.. ఇతర సినిమాలపై పడుతుందనడంలో సందేహం లేదు. ఏదేమైనా 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' విడుదల తేదీ గురించి అందరిలో ఉత్కంఠ‌ నెలకొంది.

కాగా, RRR చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైనెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ - కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఆలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్ - సముద్ర ఖని - శ్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.