Begin typing your search above and press return to search.

RRR.. నిన్న గోల్డెన్ గ్లోబ్‌.. నేడు క్రిటిక్స్ ఛాయిస్‌

By:  Tupaki Desk   |   16 Jan 2023 7:30 AM GMT
RRR.. నిన్న గోల్డెన్ గ్లోబ్‌.. నేడు క్రిటిక్స్ ఛాయిస్‌
X
ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన 'RRR' వ‌ర‌ల్డ్ వైడ్ గా ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారిన విష‌యం తెలిసిందే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల తొలి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన పాన్ ఇండియా వండ‌ర్ గా నిలిచి అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై పుర‌స్కారాల ప‌రంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తూ త‌న స‌త్తాని చాటుతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా వ‌సూళ్ల పరంగానూ రూ. 1200 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 'బాహుబ‌లి' సిరీస్ త‌రువాత తెలుగు సినిమా స‌త్తాని యావ‌త్ ప్ర‌పంచానికి చాటి చెప్పింది.

ఇక అవార్డుల ప‌రంగానూ స‌రికొత్త చ‌రిత్ర సృష్టిస్తూ ప‌లు పుర‌స్కారాల‌ని త‌న ఖాతాలో వేసుకుంటూ అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై దూసుకుపోతోంది. రీసెంట్ గా హాలీవుడ్ ప్ర‌ముఖులు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాల్లో బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో హేమా హేమీలైన హాలీవుడ్ దిగ్గ‌జాల‌ని వెన‌క్కి నెట్టి ఫైన‌ల్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ద‌క్కించుకుని భారతీయ సినిమాల్లో స‌రికొత్త చ‌రిత్ర‌కు శ్రీ‌కారం చుట్టింది.

ఇదే ఊపులో ఈ సారి 28వ‌ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లోనూ 'RRR' స‌త్తా చాట‌డం విశేషం. 28వ‌ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో 'RRR' రెండు కేట‌గిరీల్లో అవార్డుల్ని దక్కించుకుని సంచ‌ల‌నం సృష్టించింది. బెస్ట్ మ్యూజిక్ కేట‌గిరితో పాటు బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ మూవీ కేటగిరీల్లో రెండు అవార్డుల్ని ద‌క్కించుకుంది. 28వ‌ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లోని బెస్ట్ పిక్చ‌ర్, బెస్ట్ డైరెక్ట‌ర్‌, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ విజువ‌ల్ ఎఫెక్ట్‌, బెస్ట్ సాంగ్ వంటి ఐదు కేట‌గిరీల్లో పోటీప‌డింది.

ఇలా ఇండియా నుంచి 28వ‌ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో ఒకేసారి ఐదు విభాగాల్లో పోటీప‌డిన తొలి సినిమాగా 'RRR' రికార్డుని సొంతం చేసుకుంది. క్రిటిక్ ఛాయిస్ అవార్డుల్లో రాజ‌మౌళి బెస్ట్ డైరెక్ట‌ర్ గా అవార్డుని అందుకుని ఫొటోల‌కు పోజులిచ్చిన తీరు ఆక‌ట్టుకుంటోంది. త‌ను అవార్డు ని చేత ప‌ట్టుకుని ఫొటోల‌కు పోజులిచ్చిన ఓ వీడియోని క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ హ్యాండిల్ లో షేర్ చేసింది. అంతే కాకుండా దీనికి 'మంచి అర్హ‌త సాధించినందుకు ధ‌న్య‌వాదాలు' అంటూ ట్వీట్ చేయ‌డం విశేషం.

బ్రౌన్ కుర్తా, రెడ్ అండ్ లైట్ బ్లూక‌ల‌ర్ షాల్వా.. ఖాకీ క‌ల‌ర్ ప్యాంట్ ధ‌రించి రాజ‌మౌళి ఈ అవార్డుల వేడుక‌లో మెరిశారు. ఇదిలా వుంటే ఉత్త‌మ ఫారెన్ లాంగ్వేజ్ మూవీ కేట‌గిరీలో 'ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్ర‌న్ ఫ్రంట్‌', 'అర్జెంటీనా 1985', 'బార్డో', ఫాల్స్ క్రానిక‌ల్ ఆఫ్ ఏ హ్యాండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్స్‌, క్లోజ్‌, డిసీజ‌న్ టు లీవ్ వంటి ప‌లు చిత్రాల‌తో పోటీప‌డి 'RRR' అవార్డుని ద‌క్కించుకోవ‌డం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.