Begin typing your search above and press return to search.

ఆర్.ఆర్.ఆర్.. ఆంధ్రాలో అంత వసూలు చేయాల్సిందేనా..?

By:  Tupaki Desk   |   24 March 2022 3:30 AM GMT
ఆర్.ఆర్.ఆర్.. ఆంధ్రాలో అంత వసూలు చేయాల్సిందేనా..?
X
భారతదేశపు బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్'' విడుదలకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. 450 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ఈ మల్టీస్టారర్ మూవీ.. 850 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ చేసిందని టాక్. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ ట్రేడ్ సర్కిల్స్ లో జరుగుతోంది.

ఇటీవల వచ్చిన చిత్రాల్లో 'పుష్ప: ది రైజ్' పాన్ ఇండియా లెవల్ లో సత్తా చాటింది. గతేడాది డిసెంబర్ లో సోలోగా వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టింది. ఆంధ్రా ప్రాంతంలో తక్కువ రేట్లు ఉన్న సమయమది. అయినప్పటికీ నెల రోజులకు పైగా థియేటర్లలో సినిమా ఉండటం కలిసొచ్చింది. కంటెంట్ తో పాటుగా అల్లు అర్జున్ యాక్టింగ్ - దేవిశ్రీ పాటలు అక్కడి జనాలను థియేటర్లకు రప్పించాయి.

అలాంటి సినిమా అతి కష్టం మీద ఉత్తరాంధ్రలో ఏడు కోట్లు.. నెల్లూరులో మూడు కోట్లు దాకా వసూలు చేయగలిగింది. ఇప్పుడు అందరి దృష్టి 'ఆర్.ఆర్.ఆర్' పై పడింది. రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ లకు ఉన్న క్రేజ్ తో భారీ ధరలకు ఈ సినిమాని అమ్మారని తెలుస్తోంది. కాకపోతే ఇప్పుడు ఆంధ్రాలో టికెట్ రేట్లు పెరిగాయి. అయినప్పటికీ 'పుష్ప' కంటే మూడింతలు రాబట్టాల్సి ఉంటుంది.

'పుష్ప' సినిమాతో పోల్చుకుంటే ఉత్తరాంధ్రలో RRR మూవీ 20-25 కోట్ల మధ్య కలెక్ట్ చేయాలి. అలానే నెల్లూరులో 10 కోట్ల వరకూ వసూలు చేయాల్సి ఉంటుంది. ఆంధ్రాలో అదనపు షో వేయడానికి అవకాశం లభించడం.. మొదటి 10 రోజులు టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతి ఉండటంతో.. మేకర్స్ దీ బెనిఫిట్ ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు.

ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల RRR థియేట్రికల్ రైట్స్ కలిపి గతంలో ఎన్నడూ లేనంతగా 146 కోట్లు పలికాయని ట్రేడ్ వర్గాల్లో టాక్ ఉంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే బయ్యర్లు అంత మొత్తం వెనక్కి రాబట్టే అవకాశం ఉంటుంది. అలా జరగకపోతే మాత్రం వారికి ఇబ్బందులు తప్పవు. అందుకే బుకింగ్స్ బాగున్నప్పటికీ బయ్యర్లు కాస్త కలవరపడుతున్నారని తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎలా ఉంటుందో చూడాలి.

కాగా, రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాకి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.