Begin typing your search above and press return to search.

RRR మార్చిలో వస్తే ఎంత.. ఏప్రిల్ లో అయితే ఎంత..?

By:  Tupaki Desk   |   1 Feb 2022 12:30 PM GMT
RRR మార్చిలో వస్తే ఎంత.. ఏప్రిల్ లో అయితే ఎంత..?
X
అందరూ అనుకున్నట్లే RRR మూవీ మరోసారి అన్ని రిలీజ్ డేట్స్ ని కెలికేసింది. సంక్రాంతికి ముందు ఇండస్ట్రీలో ఎలాంటి హడావిడి అయితే కనిపించిందో మళ్లీ అలాంటి వాతావరణం కనిపించేలా చేసింది. ఎన్నడూ లేని విధంగా ఒక సినిమాకు రెండు విడుదల తేదీలు అనే కొత్త విధానానికి శ్రీకారం చుడుతూ మార్చి 18న లేదా ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీంతో అన్ని సినిమాలు దీనికి అనుగుణంగా డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడం మొదలు పెట్టారు.

అయితే ముందుగా ప్లాన్ చేసినట్లు కాకుండా ఆ రెండు తేదీలను వదిలేసి మరో కొత్త డేట్ ని 'ఆర్.ఆర్.ఆర్' కోసం లాక్ చేశారు. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాని 2022 మార్చి 25న తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అందరితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఈసారైనా చెప్పిన సమయానికి రిలీజ్ చేస్తారా అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఎందుకంటే RRR చిత్రాన్ని ఇప్పటికే అనేకసార్లు వాయిదా వేశారు. దీంతో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించిన నిర్మాతతో పాటుగా అత్యధిక ధర చెల్లించి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ ఆర్థిక భారాన్ని మోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొత్త తేదీ ప్రకటించినా ప్రతి రోజూ వారు టెన్షన్ పడే సిచ్యుయేషన్ ఉంది.

ఎందుకంటే RRR చిత్రాన్ని దాదాపుగా 450 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించారు. ఒక పెద్ద సినిమా చేయాలంటే ఎందరో ఫైనాన్షియర్స్ దగ్గర సొమ్ము తెచ్చి పెట్టాల్సి ఉంటుంది. సినిమా పూర్తై విడుదల కాకపోతే.. వడ్డీల రూపంలో భారం మీద పడుతూనే ఉంటుంది. ట్రిపుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీ లేట్ అవడం వల్ల ఆర్థిక భారం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఈసారి కూడా వాయిదా పడి మళ్ళీ ఏప్రిల్ 28 అంటే మాత్రం చాలా నష్టాలు భరించాల్సి ఉంటుంది.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌.. అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కనిపించనున్నారు. ఆలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మించారు.

ఇకపోతే RRR సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. నార్త్ థియేట్రికల్ రిలీజ్ రైట్స్ ని ప్రముఖ బాలీవుడ్ సంస్థ పెన్ స్తూడియోస్ వారు కొనుకోలు చేశారు. అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్-డిజిటల్-శాటిలైట్ హక్కులను కూడా పెన్ సంస్థ వాళ్లే దక్కించుకున్నారు. యూఎస్ఏ థియేట్రికల్ రైట్స్ సరిగమ సినిమాస్ - రాఫ్తార్ క్రియేషన్స్ ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు తీసుకున్నాయి. తమిళ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో ఈ ఫిక్షనల్ యాక్షన్ డ్రామా విడుదల కానుంది.