Begin typing your search above and press return to search.

'కొమరం భీముడో' సాంగ్ రేంజ్ ను ఎలా పెంచారంటే .. ?!

By:  Tupaki Desk   |   12 Jun 2022 10:20 AM GMT
కొమరం భీముడో సాంగ్ రేంజ్ ను ఎలా పెంచారంటే .. ?!
X
'బాహుబలి' సినిమాలో హోరున నేలను తాకే జలపాతం .. ప్రభాస్ కొండపైకి పాకుతూ వెళ్లడం .. తమన్నా తుమ్మెదలా ఎగురుతూ వెళ్లడం చూసి ప్రేక్షకులు పొందిన ఆశ్చర్యం .. అనుభూతి అంతా ఇంతా కాదు. ఆ తరువాత ఆ సన్నివేశాలను ఎలా చిత్రీకరించడం జరిగింది అనే వీడియోలను బయటికి వదిలారు. ఆ వీడియోలను చూసి అందరూ కూడా థియేటర్లలో కంటే ఎక్కువగా షాక్ అయ్యారు. గ్రాఫిక్స్ తో రాజమౌళి చేయించిన గారడీని తలచుకుని విస్తుపోయారు. ఒక సన్నివేశాన్ని వీఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ తో ఏ స్థాయికి తీసుకుని వెళ్లొచ్చనేది వాళ్లకి అర్థమైంది.

ఇక ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' సినిమా నుంచి కూడా అలాంటి ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ - చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. అత్యంత వేగంగా 1000 కోట్ల మార్కును టచ్ చేసిన సౌత్ సినిమాగా నిలిచింది. అలాంటి ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో ప్రతి పాటా కూడా ఏ పాటకి ఆ పాటే అన్నంతగా ఉంటుంది.

ముఖ్యంగా ఈ సినిమాలో 'కొమరం భీముడో' పాట చాలా ఎమోషన్ తో కొనసాగుతుంది. తెరపై కొమరం భీమ్ కి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఆవేశం .. ఉద్వేగం ఒక్కసారిగా తన్నుకొస్తాయి. ఒక బ్రిటీష్ పోలీస్ అధికారికంగా రాజు .. కొమరం భీమ్ ను శిక్షించే సీన్ లో నుంచి ఈ పాట పుడుతుంది. భారతీయులు తెల్లదొరల ముందు తలవంచరు అనే దేశభక్తి నేపథ్యం కూడా ఈ సీన్లో అంతర్లీనంగా ఉంటుంది. అందువలన ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయింది. ఈ పాట సమయంలో ఆడిటోరియం ఒక్కసారిగా సైలెంట్ గా మారిపోతుంది.

బ్రిటీష్ అధికారుల సమక్షంలో .. నడి వీధిలో .. వందలామంది భారతీయుల మధ్య కొమరం భీమ్ ను శిక్షించే నేపథ్యంలో ఈ పాట వస్తుంది. ఈ పాటకి తాము వీఎఫ్ ఎక్స్ ను ఎలా జోడించామనేది తెలియజేస్తూ 'మకుట' సంస్థ వారు ఈ సాంగ్ వీడియోను వదిలారు. చిన్న సెటప్ తోనే ఈ సన్నివేశాలకి ఎంతటి భారీతనాన్ని తీసుకొచ్చారానేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియోనే సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. గ్రాఫిక్స్ ఎవరు చేసినా రాజమౌళి ఆలోచనా విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.