Begin typing your search above and press return to search.

RRR- KGF2 వాయిదా ప‌డితే ఆ ముప్పు వేరే లెవ‌ల్లో!

By:  Tupaki Desk   |   15 April 2021 7:31 AM GMT
RRR- KGF2 వాయిదా ప‌డితే ఆ ముప్పు వేరే లెవ‌ల్లో!
X
తెలుగు చిత్ర‌సీమ‌లో విచిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. కేవ‌లం మూడు నెల‌ల్లోనే ప‌రిస్థితులు అక‌స్మాత్తుగా మారాయి. సెకండ్ వేవ్ ప్ర‌భావంతో పాటు ర‌క‌ర‌కాల ప‌రిణామాలు ఊపిరాడ‌నివ్వ‌ని పిరిస్థితి. ఇక ఇదే స్థితి మ‌రో ఐదారు నెల‌లు కొన‌సాగితే ఏంటి? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. కానీ ఇండ‌స్ట్రీలో కొంద‌రు పూర్తి ఆశావ‌హ ధృక్ప‌థాన్ని క‌లిగి ఉన్నార‌ని తెలిసింది.

ఏప్రిల్ -మే నెల‌ల్లో రిలీజ్ ల‌కు రావాల్సిన చాలా సినిమాలు వాయిదాలు ప‌డుతుంటే ఓ రెండు సినిమాల వాయిదాల‌కు ఆస్కారం లేద‌ని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా 16 జూలై లో రిలీజ్ కి వ‌స్తున్న కేజీఎఫ్ 2 కానీ.. అక్టోబ‌ర్ 13న రిలీజ్ కి వ‌స్తున్న ఆర్.ఆర్.ఆర్ కానీ వాయిదా ప‌డ‌కూడ‌ద‌నేది ఇండ‌స్ట్రీ నిపుణుల విశ్లేష‌ణ‌. ఎందుకంటే ఇవి రెండూ అత్యంత భారీ బ‌డ్జెట్ల‌తో తెర‌కెక్కిన అసాధార‌ణ పాన్ ఇండియా చిత్రాలు. దేశ‌వ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్న‌వి. విదేశీ రిలీజ్ లు పెద్ద‌గానే ఆశిస్తున్నారు. ఇలాంటి సినిమాల్ని వాయిదా వేస్తే ఇండస్ట్రీకి అది పెద్ద స‌మ‌స్యాత్మ‌కం అవుతుందని విశ్లేషిస్తున్నారు.

ఒక పెద్ద సినిమా వ‌స్తోంది అంటేనే అటూ ఇటూ జ‌రిగేందుకు ఎన్నో సినిమాలు ఇబ్బంది ప‌డుతుంటాయి. ఇప్పుడు ఇవి రెండూ రిలీజ్ వాయిదాలు అంటూ అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ గంద‌ర‌గోళం నెల‌కొంటుంది. ఇక రాజ‌మౌళి బృందం ఇప్ప‌టికీ అక్టోబ‌ర్ లో ద‌స‌రా కానుక‌గా రిలీజ్ కోస‌మే వేచి చూస్తున్నారు. అప్ప‌టికి ప‌రిస్థితులు పూర్తిగా స‌ద్ధుమ‌ణుగుతాయ‌నే ఆశిస్తున్నారు.

అయితే కేజీఎఫ్ 2 రిలీజ్ కి మాత్రం ఇంకో రెండు నెల‌ల స‌మ‌య‌మే మిగిలి ఉంది. ఈలోగానే ప‌రిస్థితులు పూర్తిగా అదుపులోకి వ‌స్తే ఫ‌ర్వాలేదు. అప్ప‌టికి జ‌నం తిరిగి జాగ్ర‌త్త‌ల‌తో కోలుకుంటార‌న్న ఆశాభావం టీమ్ లో ఉందిట‌. సెకండ్ వేవ్ కొద్దిరోజులే. ఉధృతంగా పెరిగే క్ర‌మంలో చిన్న‌పాటి అన‌ధికారిక లాక్ డౌన్ లు ప్ర‌జ‌ల అవ‌గాహ‌న‌ జాగ్ర‌త్త‌తో ముప్పు నుంచి తిరిగి కోలుకునే వీలుంటుంద‌ని అంచనా వేస్తున్నార‌ట‌. వ్యాక్సినేష‌న్ వేగ‌వంతం కావ‌డానికి ఈ వేవ్ హెచ్చ‌రిక అని చెబుతున్నారు.ఒక ర‌కంగా ఇది ఆశావహ ధృక్ప‌థం అని భావించాలి.

సినిమా షూటింగులను ఆపేసినా ఇదీ తాత్కాలిక‌మే. బాలీవుడ్ టాలీవుడ్ లో రిలీజ్ వాయిదాలు తాత్కాలిక‌మే. రెండు నెల‌ల లోపే అంతా కంబ్యాక్ కావాల‌న్న హోప్ అలానే ఉంది. ఇక ఆచార్య‌... పుష్ప లాంటి చిత్రాలు అనుకున్న స‌మ‌యానికి రిలీజ్ కాక‌పోయినా చాలా ఇబ్బందులు ఉంటాయి. వీటి విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకునేందుకు టీమ్ లు క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. కోవిడ్ ని వేగంగా అదుపులో పెట్టేందుకు ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌లు ప‌రిశ్ర‌మ‌లు క‌లిసి రావాల్సి ఉంటుంది. ప్ర‌తిదీ పాజిటివ్ గా ఆలోచిస్తేనే సానుకూల ప‌రిస్థితులు సాధ్య‌మ‌వుతాయ‌ని భావిస్తున్నారు.