Begin typing your search above and press return to search.

#RRR రిలీజ్ పై ఊహాగానాలు ఆపేస్తేనే మేలు!

By:  Tupaki Desk   |   22 April 2020 4:45 AM GMT
#RRR రిలీజ్ పై ఊహాగానాలు ఆపేస్తేనే మేలు!
X
క‌రోనా ఊహించ‌ని పిడుగులా మీద ప‌డింది. ఇక కోలుకునేదెలా? ప‌్ర‌స్తుతం అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ఇదే హాట్ టాపిక్. లాక్ డౌన్ తో దేశంలో చోటు చేసుకుంటోన్న ప‌రిస్థితులు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక్క రోజు జ‌న‌తా క‌ర్ఫ్యూతో మొద‌లైంది. అటుపై 21 రోజుల లాక్ డౌన్... ఆపైనా మే 3 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగింపు తో ఒక్క‌సారిగా దేశంలో సీన్ ఎలా ఉందో ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మైంది. ఇది అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లానే.. వినోద ప‌రిశ్ర‌మ‌లకు అశ‌నిపాత‌మే అయ్యింది. టాలీవుడ్ పూర్తిగా అయోమ‌యంలో ప‌డింది. కంటికి క‌నిపించ‌ని ఒక‌ వైర‌స్ ఇంత‌గా కుదేల‌య్యేలా చేస్తుందా? అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చే కార్య‌క్ర‌మాలకు న‌డుం బిగించి ప్రతి సెల‌బ్రిటీ ప‌ని చేస్తున్నారు. క‌రోనాను త‌రిమేయాల‌న్న సంక‌ల్పం అంద‌రిలోనూ ఉంది. ఈ విష‌యాల‌న్నీ ప‌క్క‌న‌బెడితే పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ సంగ‌తేమిటి? ఎవ‌రి వెర్ష‌న్ ఎలా ఉంది? అన్న‌ది చూస్తే.. ప్ర‌స్తుతానికి క్వ‌శ్చ‌న్ మార్క్ క‌నిపిస్తోంది.

ఆర్.ఆర్.ఆర్ నిర్మాత దాన‌య్య క‌రోనా ఏమీ చేయ‌ద‌న్న ధీమాను క‌న‌బ‌రిచారు. ఎట్టి ప‌రిస్థితుల్లో 2021 జ‌వ‌వ‌రి 8న సినిమాని రిలీజ్ చేస్తామ‌‌ని బ‌ల్ల గుద్దీ మరీ చెప్పారు. లాక్ డౌన్ తో షూటింగ్ ఆల‌స్య‌మై రిలీజ్ వాయిదా ప‌డ‌నుంద‌ని అప్ప‌టికే క‌థ‌నాలు వేడెక్కించ‌డంతో చ‌ల్ల‌బ‌రిచే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత జ‌రుగుతున్నా.. దాన‌య్య అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారంటే.. బ్యాకెండ్ లో ఏదో గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నార‌ని భావించారంతా. దాన‌య్య న‌మ్మ‌కం చూశాక‌.. అభిమానుల్లో ఆశ‌లు అప్ప‌టివ‌ర‌కూ సజీవంగానే ఉన్నాయి. కానీ ఒక్క‌సారిగా రెండ‌వ సారి లాక్ డౌన్ పొడిగించేయ‌డం.. అటుపైనా తెలంగాణ‌లో ఎక్స్ టెన్ష‌న్ ఉంటుంద‌ని కేసీఆర్ ప్ర‌క‌టించ‌డం వ‌గైరా వ‌గైరా చూస్తుంటే సీన్ ఒక్క‌సారిగా మారిపోయింది. దీంతో ఎవ‌రికి వారు సైలెంట్ అయిపోయారు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఎప్పుడుంటుందా? అని సాక్షాత్తు రాజ‌మౌళినే ప్ర‌శ్నిస్తే ఏమో నాక్కూడా తెలియ‌ద‌నేసారు.

రిలీజ్ పై నో ఐడియా అంటూ దాటేసారు. అయితే సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం వేరుగా ఉంది. సంక్రాంతి సీజ‌న్ ని మిస్ అయితే 2021 వేస‌వి సెల‌వుల్ని ఆర్.ఆర్.ఆర్ టార్గెట్ చేస్తుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ తాజా ప‌రిస్థితి...ఇండస్ట్రీ ఇన్ సైడ్ ప‌రిస్థితులు చూస్తుంటే వ‌చ్చే స‌మ్మ‌ర్ రిలీజ్ కూడా క‌ష్ట‌మేన‌ని అర్థ‌మవుతోంది. ఇప్ప‌టికే ఆర్ ఆర్ ఆర్ 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యినా నిర్మాణానంత‌ర ప‌నులు భారీగా చేయాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ షూట్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి చేయాలి. అందుకు ఎక్కువ‌గానే స‌మ‌యం ప‌డుతుందని విశ్లేషిస్తున్నారు. ఒక నెల పాటు లాక్ డౌన్ ఉన్న‌ప్పుడు టీమ్ దాన్ని పెద్ద‌గా డిలే గా భావించ‌లేదు. త‌ర్వాత లాక్ డౌన్ పొడిగింపు... మే 3 త‌ర్వాత కూడా లాక్ డౌన్ పొడిగిస్తే ప‌రిస్థితి ఏమిట‌న్న‌దే ఇప్పుడు జ‌క్క‌న్న‌ని ఆలోచ‌న‌లో ప‌డేసింది. అయితే సీక్రెట్ గా ల్యాబుల్లో ప‌ని కానిచ్చేస్తూ కొంత‌ వ‌ర‌కూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌న్న స‌మాచారం ఇది వ‌ర‌కూ లీకైంది. అయినా స‌మ్మ‌ర్ 2021 నాటికి సాధ్యమేనా? అన్న‌ది చెప్ప‌లేని ప‌రిస్థితి.