Begin typing your search above and press return to search.

నా దృష్టిలో 'బాహుబలి' కంటే 'ఆర్ ఆర్ ఆర్' పెద్దది!

By:  Tupaki Desk   |   15 March 2022 3:30 PM GMT
నా దృష్టిలో బాహుబలి కంటే ఆర్ ఆర్ ఆర్ పెద్దది!
X
ఒక సినిమా కోసం ఒక స్టార్ హీరో వెచ్చించే సమయం చాలా విలువైనది. ఎందుకంటే ఆ సినిమా తరువాత చేయవలసిన ప్రాజెక్టుపై ఆ ప్రభావం పడుతుంది. అందువలన సాధ్యమైనంతవరకూ ఎలాంటి పరిస్థితుల్లో షూటింగు కానీ .. విడుదల కాని వాయిదా పడకుండా చూసుకుంటూ ఉంటారు.

ఒకవేళ షూటింగు విషయంలో జాప్యం జరుగుతున్నట్టుగా అనిపిస్తే, వెంటనే ఆ విషయాన్ని మేకర్స్ దృష్టికి తీసుకుని వెళుతుంటారు. అలాంటిది 'బాహుబలి' సినిమా ఎంత ఆలస్యమైనా రాజమౌళికి ప్రభాస్ పూర్తి సహకారాన్ని అందిస్తూ వచ్చాడు.

అప్పటివరకూ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వేరు. అందువలన ఆయన ఓపిక పట్టడంలో అర్థం ఉంది. కానీ ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరూ కూడా విపరీతమైన స్టార్ డమ్ ఉన్నవారు. అలాంటి ఇద్దరి హీరోలను 'ఆర్ ఆర్ ఆర్' కోసం ఇంతకాలం పాటు లాక్ చేయడం కరెక్ట్ కాదేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో రాజమౌళికి అదే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన తనదైన శైలిలో స్పందించారు. " ఈ సినిమా చూసిన తరువాత ఎవరికీ కూడా అలా అనిపించదు. ఇలాంటి ఒక సినిమా కోసం ఇంతకాలం వెచ్చించడంలో అర్థం ఉందని అనుకుంటారు.

నా దృష్టిలో 'బాహుబలి' కంటే 'ఆర్ ఆర్ ఆర్' పెద్దది. అందువలన కరోనాతో కలుపుకుని ఇంత సమయం పట్టింది. హీరోలు ఇద్దరూ కూడా ఇంతకాలం పాటు ఈ సినిమా కోసం పనిచేయవలసి వచ్చిందే అనుకోలేదు. అలాగే సినిమా చూసిన తరువాత మీరూ అదే అనుకుంటారు.

ఇక 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ ఆలస్యమైంది కనుక నిర్మాతకి ఇబ్బంది ఎక్కువే. అందువలన ఎన్టీఆర్ - చరణ్ పారితోషికం తగ్గించుకున్నారా? అని అడుగుతున్నారు. ఈ సినిమా కోసం వాళ్లిద్దరూ ఎన్నో త్యాగాలు చేశారు. ఈ క్షణం వరకూ మాతో కలిసి కష్టపడుతూనే ఉన్నారు. ఇంకా పారితోషికం తగ్గించుకోవడం ఏంటి? అంటూ నవ్వేశారు.

డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. ఓపెనింగ్స్ దగ్గర నుంచే ఈ సినిమా కొత్త రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ - చరణ్ కలిసి చేసే ఈ దండయాత్రలో ఎన్ని రికార్డులు దాసోహమంటాయో చూడాలి.