Begin typing your search above and press return to search.

RRR: నార్త్ లో జక్కన్న ప్లాన్స్ వర్కవుట్ అయ్యేనా..?

By:  Tupaki Desk   |   22 March 2022 2:30 AM GMT
RRR: నార్త్ లో జక్కన్న ప్లాన్స్ వర్కవుట్ అయ్యేనా..?
X
రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ కు మరో నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో జక్కన్న అండ్ టీమ్ జెట్ స్పీడ్ తో ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇప్పటికే దుబాయ్ లో RRR ను ప్రమోట్ చేసిన చిత్ర బృందం.. బెంగళూర్ లోని చిక్ బళ్ళాపూర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించింది. ఇక ఉత్తరాది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ట్రిపుల్ ఆర్ టీం.. అక్కడ ఉత్తమంగా ప్రయత్నిస్తుంది.

ఇందులో భాగంగా గుజరాత్ - ఢిల్లీలలో పర్యటించారు. అలానే అమృతసర్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. రాజమౌళి - తారక్ - చరణ్ ముగ్గురూ పంజాబీ సాంప్రదాయంలో తలకు వస్త్రం చుట్టుకొని అక్కడ నది ఒడ్డున ప్రార్థన చేసి సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నారు.

తాజాగా జైపూర్ లో ల్యాండ్ అయిన RRR టీం.. కోల్ కటా - వారణాసి వంటి నగరాలను సందర్శించి తమ సినిమాని ప్రమోట్ చేసుకొనున్నారు. చిత్ర బృందం ఎక్కడికి వెళ్ళినా అక్కడ వారికి మంచి ఆదరణ దక్కుతోంది. ఉత్తర భారతదేశంలోని అన్ని ప్రముఖ ప్రదేశాలలో ప్రమోషన్ ప్రచారం చేయడం ఓపెనింగ్స్ పై ప్రభావం చూపుతుంది.

అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే నార్త్ ఆడియన్స్ ఇప్పటికే అనేక స్వాతంత్ర్య నేపథ్య చిత్రాలను చాలాసార్లు చూసారు. అందులో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు RRR సినిమా కూడా అదే జాబితాలో చేరుతుందా లేదా అని అందరూ ఆలోచిస్తున్నారు.

1920స్ బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమరం భీమ్ నిజ జీవిత పాత్రల స్పూర్తితో రాసుకున్న కల్పిత కథతో ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రాన్ని తెరకెక్కించారు రాజమాళి. దీనికి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించగా.. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అందించారు.

ఇందులో రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ కూడా బాగున్నాయి.

పాపులర్ బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ - అలియా భట్ నటించడం ఈ సినిమాకు అదనపు లాభం చేకూరుస్తుంది. 'బాహుబలి' సినిమాల తర్వాత జక్కన్న నుంచి వచ్చే సినిమా కావడంతో ఆల్రెడీ బజ్ ఏర్పడింది. మరి నార్త్ లో RRR సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

కాగా, డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో 'ఆర్.ఆర్.ఆర్' విడుదల కానుంది.