Begin typing your search above and press return to search.

నాలుగు భాష‌ల్లో తార‌క మంత్రం!

By:  Tupaki Desk   |   3 Sep 2019 2:52 PM GMT
నాలుగు భాష‌ల్లో తార‌క మంత్రం!
X
టాలీవుడ్ కొత్త మ‌లుపు తీసుకుంటున్న అరుదైన సంద‌ర్భ‌మిది. మ‌న అగ్ర‌హీరోలు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ భారీ చిత్రాల్లో న‌టిస్తున్నారు. బాహుబ‌లి- సాహో లాంటి పాన్ ఇండియా సినిమాల్లో న‌టించి డార్లింగ్ ప్ర‌భాస్ అస‌లైన వార్ కి తెర తీశాడు. ఉత్త‌రాది- ద‌క్షిణాది అనే తేడా లేకుండా అన్ని చోట్లా ప్ర‌భాస్ ఫేమ‌స్ అయ్యారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ గా ప‌లు దేశాల్లో పాపులారిటీ పెంచుకున్నారు. సాహో చిత్రం కోసం హిందీ-త‌మిళ వెర్ష‌న్ల‌కు డ‌బ్బింగ్ కూడా చెప్పాడు డార్లింగ్. ప్ర‌తిచోటా త‌న‌దైన మార్క్ వేసేందుకు ప్ర‌భాస్ తాప‌త్ర‌య‌ప‌డ‌డం అభిమానుల్లో చ‌ర్చ సాగింది.

ఈ త‌ర‌హాలోనే ఇత‌ర అగ్ర క‌థానాయ‌కులు ఆలోచిస్తున్నారా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. `బాహుబ‌లి` స్ఫూర్తితో టాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న మ‌రో భారీ చిత్రం ఆర్.ఆర్.ఆర్ కోసం చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్లుగా వెల‌గాల‌న్న‌ది ఆ ఇద్ద‌రి ప్లాన్. ఇందులో ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. మెగాప‌వ‌ర్‌ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ ఆంధ్రా విప్ల‌వ నాయ‌కుడు అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని తెలుగు - త‌మిళం - క‌న్న‌డం - మ‌ల‌యాళం - హిందీ లో అత్యంత భారీగా రిలీజ్ చేయ‌నున్నారు. బాహుబ‌లి-సాహో త‌ర‌హాలోనే అత్యంత భారీ రిలీజ్ ఉంటుంద‌ని తెలుస్తోంది. చ‌ర‌ణ్ - తార‌క్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావ‌డంతో ఈ చిత్రం కోసం ర‌క‌ర‌కాల విభాగాల్లో త‌మ‌దైన మార్క్ కోసం ఈ హీరోలు ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌.

తొలిగా తార‌క్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను కొమరం భీం జయంతి ( అక్టోబర్ 22) సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ ఫస్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ లో డైలాగ్ కూడా ఉంటుంద‌ని తెలుస్తోంది. తెలుగు - త‌మిళ్‌ - క‌న్న‌డ‌ - హిందీ - మ‌ళ‌యాళ భాష‌ల్లో ఎన్టీఆర్ లుక్ రిలీజ్ ఉంటుందిట‌. తార‌క్ బ‌హు భాషా పండితుడు. రెండు మూడు భాష‌ల్ని అల‌వోక‌గా మాట్లాడేయ‌గ‌ల‌రు కాబ‌ట్టి ఆ భాష‌ల్లో అత‌డే డ‌బ్బింగ్ చెబుతున్నార‌ట‌. ఇక అల్లూరి సీతారామ రాజు పాత్ర‌లో న‌టిస్తున్న చ‌ర‌ణ్ కూడా బ‌హుభాష‌లు మాట్లాడ‌గ‌ల‌రు. తెలుగు - త‌మిళం - హిందీలో చ‌ర‌ణ్ కి ప్ర‌వేశం ఉంది. అయితే ఇరుగు పొరుగు భాష‌ల్లో త‌న పాత్ర‌కు త‌నే ఆ ఇద్ద‌రు స్టార్లు అనువాదం చెప్పుకుంటారా? అన్న‌దానికి స్ప‌ష్ఠంగా చిత్ర‌యూనిట్ నుంచి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. సొంత డ‌బ్బింగ్ కేవ‌లం టీజ‌ర్ వ‌ర‌కేనా.. పూర్తి సినిమాకి ఎవ‌రికి వారే అనువాదం చెప్పుకుంటారా? అన్న‌ది చూడాలి.