Begin typing your search above and press return to search.

'నాటు నాటు' పాట: ఊర నాటు స్టెప్పులతో అదరగొట్టిన తారక్ - చరణ్..!

By:  Tupaki Desk   |   10 Nov 2021 10:08 AM GMT
నాటు నాటు పాట: ఊర నాటు స్టెప్పులతో అదరగొట్టిన తారక్ - చరణ్..!
X
ఎన్టీఆర్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రలతో దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్'' (రౌద్రం రణం రుధిరం). ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాని పాన్ ఇండియా స్థాయిలో 2022 జనవరి 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా 'నాటు నాటు' అనే రెండో పాటను రిలీజ్ చేశారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో వచ్చిన ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తోంది.

''పొలంగట్టు గుమ్ములోన పోట్లగిత్త దూకినట్లు.. పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్లు.. కిర్రు సెప్పులేసుకోని కర్రసాము సేసినట్టు.. మర్రిసెట్టు నీడలోన..'' అంటూ సాగిన ఈ పాట మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తోంది. 'నా పాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు.. నాటు నాటు నాటు నాటు నాటు నాటు.. వీర నాటు.. ఊర నాటు' అంటూ ఎన్టీఆర్ - రామ్ చరణ్ మాస్ స్టెప్పులతో దుమ్ముదులిపారు.

ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్స్ అయిన చరణ్ - తారక్ కలిసి చేసిన 'నాటు నాటు' పాట సిల్వర్ స్క్రీన్ మీద సినీ అభిమానులకు విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇందులో ఇద్దరూ పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. వారి కోసం రమా రాజమౌళి డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కూడా కొత్తగా ఉన్నాయి. హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఈ పాటలో భాగం అయ్యారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఊర నాటు స్టెప్పులను కొరియోగ్రఫీ చేశారు.

ఎంఎం కీరవాణి ఈ పాటకు మాంచి మాస్ ట్యూన్ సమకూర్చగా.. యువ గాయకులు రాహుల్‌ సిప్లింగంజ్‌ - కాల భైరవ హుషారెత్తించేలా ఆలపించారు. ఈ గీతానికి ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ జానపద శైలి సాహిత్యం అందించారు. కెకె సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించారు.

కాగా, ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌.. కొమురం భీమ్‌ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అజయ్ దేవగన్ - ఆలియా భట్‌ - శ్రియ - సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్లు - 'దోస్తీ' సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన 'నాటు నాటు' పాట నెట్టింట సంచలనాలు క్రియేట్ చేస్తోంది.

RRR చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెత్ తో నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాపంగా పది భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం.. ఎన్టీఆర్-రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేస్తున్న మూవీ కావడంతో ఆర్.ఆర్.ఆర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.