Begin typing your search above and press return to search.

RRR నైజాం బేర‌సారాలు? ఎవ‌రాయ‌న‌?

By:  Tupaki Desk   |   16 Jun 2019 10:20 AM GMT
RRR నైజాం బేర‌సారాలు? ఎవ‌రాయ‌న‌?
X
ఎస్.ఎస్.రాజ‌మౌళి బ్రాండ్ అంటే చాలు. ఆ సినిమాకి డిమాండ్ చుక్క‌ల్ని తాకుతోంది. మార్కెట్ వ‌ర్గాల్లో నిరంత‌రం ఇదో ఆస‌క్తిక‌ర డిబేట్. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తు న్న ఆర్.ఆర్.ఆర్ కి డిమాండ్ స్కైలోనే ఉంది. సినిమా ఇంకా స‌గ‌భాగం చిత్రీక‌ర‌ణ అయినా పూర్త‌వ్వ‌కుండానే భారీ మొత్తాల్ని వెచ్చించి ఏరియా వైజ్ హ‌క్కుల‌పై ట్రేడ్ వ‌ర్గాలు ఖ‌ర్చీఫ్ వేసేస్తుండ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే హిందీ రైట్స్.. నైజాం రైట్స్ అమ్మ‌కాలు పూర్త‌య్యాయి.

అయితే ఏపీ.. నైజాం రిలీజ్ రైట్స్ ని ఛేజిక్కించుకునేది ఎవ‌రు? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక నైజాం రైట్స్ కోసం ఇప్ప‌టికే టాప్ డిస్ట్రిబ్యూట‌ర్ కం నిర్మాత దిల్ రాజు రెడీగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఏషియ‌న్ సునీల్ నారంగ్ తో క‌లిసి దిల్ రాజు ఆర్.ఆర్.ఆర్ రైట్స్ ని ఛేజిక్కించుకునే ప్లాన్ లో ఉన్నార‌ట‌. ఆ మేర‌కు నిర్మాత డివివి దాన‌య్య‌తో మంత‌నాలు సాగిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే దాన‌య్య రేంజు ఎంత‌లో ఉంది? అంటే రూ.80 కోట్లు ఎవ‌రు ముందు ప‌లికితే వారికి నైజాం రైట్స్ ని అప్ప‌జెప్పాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌.

ఇటీవ‌ల ఓవ‌ర్సీస్ రైట్స్ కే 70 కోట్లు ప‌లికింది. దుబాయ్ కి చెందిన ఫార్స్ ఫిలింస్ సంస్థ ఆర్.ఆర్.ఆర్ విదేశీ రిలీజ్ (చైనా మిన‌హా) హ‌క్కుల్ని చేజిక్కించుకుంది. ఆ లెక్క‌న చూస్తే నైజాం ఏరియాకి 80 కోట్ల లెక్క స‌రైన‌దేన‌ని దాన‌య్య భావిస్తున్నారు. అయితే ఈ విష‌యంలో ఎంత త‌గ్గించుకోగ‌లిగితే అంతా క‌లిసొస్తుంద‌ని దిల్ రాజు- నారంగ్ బృందం మంత‌నాలు సాగిస్తున్నార‌ట‌. అయితే 80 కోట్ల మొత్తం అంటే చాలా పెద్ద‌దే. నైజాంలో అంత వ‌సూలు చేస్తుందా? అంటే ఇటీవ‌ల ప‌రిణామాలు అనుకూలంగానే ఉన్నాయ‌ని విశ్లేషిస్తున్నారు.

ఎలానూ భారీ చిత్రాల రిలీజ్ ల వేళ టిక్కెట్టు ధ‌ర పెంచుకునే వెసులుబాటు థియేట‌ర్ ఓన‌ర్ల‌కు ఉంది. కోర్టుల‌కు వెళ్లి మ‌రీ ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా అనుకున్న‌ది సాధించుకుంటున్నారు. పెద్ద సినిమా పేరుతో టిక్కెట్టు రేట్ల‌ను అడ్డ‌గోలుగా పెంచేసి తొలి వారంలోనే క్యాష్ చేసుకుంటున్నారు. నైజాం- ఏపీలో డైరెక్టుగా ప్ర‌భుత్వాలే టిక్కెట్టు పెంపున‌కు అడ్డు క‌ట్ట వేయ‌కుండా సాయ‌ప‌డుతున్నాయి. పైపెచ్చు ఇటీవ‌ల జీఎస్టీ రేటును కూడా త‌గ్గించేయ‌డంతో ఆ మేర‌కు రిలీజ్ చేసే సినిమాల‌కు క‌లిసొస్తోంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని 30 జూలై 2020న రిలీజ్ చేస్తున్నామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు కాబ‌ట్టి డెడ్ లైన్ ప్ర‌కారం రిలీజ్ చేసేందుకు రాజ‌మౌళి టీమ్ ఎంతో శ్ర‌మిస్తోంది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ ఫ్రీడం ఫైట‌ర్స్ గా న‌టిస్తున్నారు. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో చ‌ర‌ణ్‌.. కొమ‌రం భీమ్ పాత్ర‌లో తార‌క్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. స్వాతంత్య్రానికి పూర్వం ఈ విప్ల‌వ‌వీరులు బ్రిటీష‌ర్ల‌తో ఎలాంటి పోరాటం సాగించారు? అన్న‌దానికి ఫిక్ష‌న్ ని జోడించి జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్నారు.