Begin typing your search above and press return to search.

సంచలనం.. హాలీవుడ్లో 'ఆర్ఆర్ఆర్' నం.1

By:  Tupaki Desk   |   25 March 2022 5:19 PM GMT
సంచలనం.. హాలీవుడ్లో ఆర్ఆర్ఆర్ నం.1
X
ఒకప్పుడు యుఎస్‌లో తెలుగు సినిమాలు రిలీజవడమే గగనంగా ఉండేది. అలాంటిది మన సినిమాలు మిలియన్లకు మిలియన్లు కలెక్షన్లు రాబట్టడం.. అక్కడి బాక్సాఫీస్ ఛార్ట్స్‌లో స్థానం సంపాదించడం చూస్తున్నాం. ఇదంతా గత 10-15 ఏళ్లలో జరిగిన మార్పు. అందులోనూ ఐదేళ్ల కిందట 'బాహుబలి: ది కంక్లూజన్' అక్కడ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు.

ఏకంగా 20 మిలియన్ డాలర్లు కొల్లగొట్టి హాలీవుడ్ ట్రేడ్ పండిట్లు కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. ఇప్పుడు రాజమౌళి నుంచి వచ్చిన కొత్త చిత్రం 'ఆర్ఆర్ఆర్' కూడా అదే స్థాయిలో యుఎస్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ప్రిమియర్లతోనే 3 మిలియన్ డాలర్లకు పైగా ఈ చిత్రం కొల్లగొడుతోందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అంతే కాదు.. ఈ వీకెండ్లో హాలీవుడ్ బాక్సాఫీస్ ఛార్ట్‌లో 'ఆర్ఆర్ఆర్'దే అగ్రస్థానం కావడం విశేషం. హాలీవుడ్లో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ కాకపోవడం దీనికి కలిసొచ్చింది.'ఆర్ఆర్ఆర్' 3 మిలియన్ల డాలర్లకు పైగా వసూళ్లతో యుఎస్‌లో ఈ గురువారం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అగ్ర స్థానంలో నిలిచింది. 'బ్యాట్ మ్యాన్' 1.5 డాలర్లతో దాని తర్వాతి స్థానంలో నిలిచింది.

చెప్పుకోదగ్గ కొత్త చిత్రాలు లేకపోయినప్పటికీ.. ఓ ఇండియన్ మూవీ ఇలా యుఎస్‌ బాక్సాఫీస్‌లో అగ్రస్థానంలో నిలవడం అసాధారణమైన విషయం. 'ఆర్ఆర్ఆర్' ఊపు చూస్తుంటే వీకెండ్లో 10 మిలియన్ మార్కుకు చేరువగా వెళ్లేలా ఉంది. ఫుల్ రన్లో 15 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు ఉండొచ్చని ప్రాథమికంగా ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. ఐతే ఓవరాల్‌గా 'బాహుబలి-2' రికార్డులను ఈ చిత్రం బద్దలు కొట్టడం మాత్రం కష్టమే కావచ్చు.

తెలుగు రాష్ట్రాల వరకు ఈ చిత్రం అన్ని రికార్డులనూ దాటేయబోతోంది. ఇండియాలో మిగతా ప్రాంతాల్లో సినిమా ఫలితం ఏంటన్నది వీకెండ్ గడిస్తే కానీ చెప్పలేం. రిలీజ్ రోజైలే అన్ని చోట్లా అద్భుతమైన స్పందనే వస్తోంది.