Begin typing your search above and press return to search.

హాలోవీన్‌ లో 'RRR'.. tRRRick లేదా tRRReat..!

By:  Tupaki Desk   |   1 Nov 2022 4:40 AM GMT
హాలోవీన్‌ లో RRR.. tRRRick లేదా tRRReat..!
X
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'RRR' ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్.. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

'ఆర్.ఆర్.ఆర్' విడుదలై నెలలు గడుస్తున్నా ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏదొక రూపంలో వార్తల్లో నిలుపుతూనే ఉంది. ఓటీటీలో గ్లోబల్ ఆడియన్స్ ఆదరణ పొందిన తర్వాత.. వివిధ మార్గాల్లో ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని పాశ్చాత్య సినీ అభిమానులు ప్రశంసిస్తూ వస్తున్నారు.

RRR సినిమా ఇటీవల జపాన్ లో రిలీజ్ కాబడి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో.. ఇందులో రామారాజు మరియు భీమ్ పాత్రలకు సంబంధించిన కార్టూన్స్ - ఆర్ట్ వర్క్స్ - డ్రాయింగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు 'హాలోవీన్' పార్టీలకు కూడా ట్రిపుల్ ఆర్ చిత్రం ప్రేరణగా మారుతోంది.

హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్ మరియు ప్రొడక్షన్ డిజైనర్ అయిన ఏరియల్ విదా హాలోవీన్ పార్టీలో భాగంగా తన ఫ్రెండ్ తో కలిసి రామారాజు మరియు భీమ్ గెటప్‌ లతో అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమాలోని ఎన్టీఆర్ - రామ్ చరణ్ క్యాస్టూమ్స్ ధరించి.. RRR హీరోల లుక్స్ లోకి మారిపోయారు.

అంతేకాదు tRRRick లేదా tRRReat అంటూ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో తారక్ ఇంటర్వెల్ సీన్ ని బొమ్మలతో రీ-క్రియేట్ చేశారు. ఈ చిత్ర నిర్మాణంలో ఎటువంటి జంతువులకు హాని జరగలేదని.. సినిమాలో చూపించే గుర్రాలు, ఎద్దులు, పక్షులు, పులులు, తోడేళ్లు, ఎలుగుబంట్లు, చిరుతలు, జింకలు, చేపలు, పాము అన్నీ కంప్యూటర్‌ తో రూపొందించినవే అంటూ ఫన్నీ డిస్క్లైమర్ కూడా వేశారు ఏరియల్.

హలోవీన్ RRR థీమ్ పై చిత్ర బృందం స్పందిస్తూ.. ఆ ఫోటోలు వీడియోలు షేర్ చేసింది. ''ఇది అన్నింటినీ మించిన ప్రేమ. #RRR మూవీ యూఎస్ఏతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఎలా చొచ్చుకుపోయిందో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. మా నుండి మీకు హాలోవీన్ శుభాకాంక్షలు'' అని పేర్కొన్నారు.

అమెరికాలోని చాలా మంది సినీ అభిమానులు RRR సినిమాని బాగా ఆస్వాదించారు. హలోవీన్ తో పాటుగా వివిధ పార్టీలలో రామ్ మరియు భీమ్ గెటప్‌ లతో ఆకట్టుకున్నారు. ఇది ఎవరూ ఊహించని విషయమనే చెప్పాలి. భారతీయ చిత్రానికి అది కూడా ఒక తెలుగు సినిమా అంతర్జాతీయంగా ప్రేమను పొందడం గర్వకారణమనే చెప్పాలి.

ఇకపోతే RRR సినిమా ఈసారి ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా తరపున అఫిషియల్ ఎంట్రీగా ఎంపిక చేయనప్పటికీ.. వేరే మార్గాల్లో అకాడమీ నామినేషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #OscarForRRR అనే హ్యాష్‌ ట్యాగ్‌ కు వెస్టర్న్ ఆడియన్స్ మరియు హాలీవుడ్ ప్రముఖ మ్యాగజైన్స్ నుంచి మద్దతు లభిస్తోంది. మరి జక్కన్న 'ఆర్.ఆర్.ఆర్' ఆస్కార్ సాధించి, అందరూ గర్వపడేలా చేస్తుందేమో వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.