Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్: RRR మళ్ళీ వాయిదా..!

By:  Tupaki Desk   |   1 Jan 2022 12:05 PM GMT
బిగ్ బ్రేకింగ్: RRR మళ్ళీ వాయిదా..!
X
యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా విడుదల పడింది. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాని కరోనా పరిస్థితుల నేపథ్యంలో మరోసారి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పరిస్థితులు చక్కబడిన తర్వాత రిలీజ్ చేస్తామని చిత్ర బృందం తెలిపింది.

RRR సినిమాలో భాగమైన అన్ని పార్టీల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వాయిదా వేయవలసి వచ్చిందని మేకర్స్ ఓ నోట్ విడుదల చేశారు. ''మనం ఎడతెరిపిలేని ప్రయత్నాలు చేసినప్పటికీ, కొన్ని పరిస్థితులు మన కంట్రోల్ లో ఉండవు. ఇండియాలో అనేక రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేస్తున్నందున మాకు ఛాయిస్ లేకుండా పోయింది. మీ ఉత్సాహాన్ని అలానే దాచుకోమని కోరడం మినహా మాకు వేరే మార్గం లేదు'' అని RRR బృందం పేర్కొన్నారు.

''భారతీయ సినిమా కీర్తిని తిరిగి తీసుకువస్తామని మేము వాగ్దానం చేసినట్లుగానే సరైన సమయంలో మేము చేస్తాము'' అని తెలిపారు. RRR సినిమా మీద కురిపిస్తున్న ప్రేమకు అభిమానులు మరియు ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అని దర్శకనిర్మాతలు ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్''. ఇద్దరు టాలీవుడ్ బిగ్ స్టార్స్ తో భారీ బడ్జెట్ పెట్టి రాజమౌళి రూపొందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని చివరగా 2022 జనవరి 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రెడీగా ఉండటంతో.. జక్కన్న అండ్ టీమ్ రెండు నెలల ముందే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న RRR కోసం ఇతర ఇండస్ట్రీలలో కూడా భారీ ఎత్తున ప్రచారం చేశారు. ఈ క్రమంలో సినిమాపై నేషనల్ వైడ్ పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరో ఐదు రోజుల్లో ప్రీమియర్స్ పడతాయని అనుకుంటుండగా.. కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరియు ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో థియేటర్ల మీద ఆంక్షలు విధించారు. దిల్లీలో థియేటర్లు కంప్లీట్ గా మూతపడ్డాయి. ముంబయిలో సినిమా హాళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. అక్కడ నైట్ కర్ఫ్యూ కూడా ఉండటంతో రాత్రి షోలకు అవకాశం లేకుండా పోయింది. అలానే కేరళ - కర్ణాటకలతో పాటుగా తమిళనాడులోనూ థియేటర్లను 50 శాతం సీటింగ్ కెపాసిటీకి పరిమితం చేశారు.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని.. దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల విడుదలకు ప్రతికూల వాతావరణం ఉండటంతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేయాలని నిర్ణయించుకున్నారు. కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. RRR వాయిదాల పర్వం ఇంకా కొనసాగుతుండటంతో సినీ ప్రియులు నిరాశకు గురవుతున్నారు. అదే సమయంలో 'ఆర్.ఆర్.ఆర్' వంటి మాగ్నమ్ ఓపస్ ను ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు బాగున్నప్పుడే రిలీజ్ చేయడం సరైన నిర్ణయమని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, విప్లవవీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత స్వభావాల ఆధారంగా కల్పిత కథతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని తెరకెక్కించారు. రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అలియా భట్ - ఒలివియా మోరిస్ - అజయ్ దేవగన్ - శ్రియా శరణ్ - సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య RRR చిత్రాన్ని నిర్మించారు.