Begin typing your search above and press return to search.

రిలీజ్ కు ముందే యూఎస్ఏలో RRR గర్జన..!

By:  Tupaki Desk   |   20 March 2022 4:30 AM GMT
రిలీజ్ కు ముందే యూఎస్ఏలో RRR గర్జన..!
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోవిడ్ పాండమిక్ కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన ఈ చిత్రం.. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

RRR చిత్రం యూఎస్ఏలో 1150 కి పైగా లోకేషన్స్ లో.. యూకేలో 1000+ స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. కనీవినీ ఎరుగని విధంగా ప్రీ సేల్స్ తో దూసుకుపోతోంది. యూఎస్ లో ప్రీ సేల్స్ లో 2 మిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద RRR సృష్టించే విధ్వంసానికి ఇది ప్రారంభం మాత్రమే అని చెప్పవచ్చు. ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే యూఎస్ ప్రీ బుకింగ్స్ రిలీజ్ టైంకి ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఒక్క యూఎస్ లోనే కాదు.. ఆస్ట్రేలియా - బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి.

రాజమౌళి గత చిత్రం 'బాహుబలి 2' యూఎస్ ప్రీ సేల్స్ లో 3 మిలియన్ డాలర్స్ అందుకుని సంచలనం సృష్టించింది. ఇప్పుడు RRR సినిమా ఆ రికార్డ్ ను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. ఏదేమైనా విదేశీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రభంజనం సృష్టించబోతోందని ప్రీ సేల్స్ చెబుతున్నాయి. అమెరికాలో మార్చి 24న ప్రీమియర్స్ పడనున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరలు పెంచుకోడానికి అనుమతి వచ్చిన నేపథ్యంలో.. 'ఆర్.ఆర్.ఆర్' భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. కొన్ని నిమిషాల్లోనే అన్ని టికెట్స్ అమ్ముడయ్యాయి. నేడో రేపో పూర్తి స్థాయిలో బుకింగ్స్ తెరుచుకోనున్నాయి.

1920స్ బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమరం భీం నిజ జీవిత పాత్రలు తీసుకొని కల్పిత కథతో ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించారు.

అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరిస్ - సముద్ర ఖని - శ్రీయా వంటి పాపులర్ స్టార్లు ఈ సినిమాలో భాగం అవుతున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా.. బుర్రా సాయి మాధవ్ సంభాషణలు రాసారు.