Begin typing your search above and press return to search.

ఆర్ఆర్‌ఆర్‌ పుకార్లు నిజమయ్యేలా ఉన్నాయి

By:  Tupaki Desk   |   13 Aug 2021 3:30 AM GMT
ఆర్ఆర్‌ఆర్‌ పుకార్లు నిజమయ్యేలా ఉన్నాయి
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌ తో పాటు పాట ఇతర వీడియోల్లో సినిమాను దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. అయినా కూడా మీడియాలో మాత్రం ఆర్ ఆర్ ఆర్‌ సినిమా విడుదల తేదీ మారబోతుంది.. వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటి వరకు చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ విషయమై స్పందించడం లేదు. సినిమాను అక్టోబర్ లోనే విడుదల చేస్తారని కొందరు రాజమౌళిపై నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. రాజమౌళి గురించి బాగా తెలిసిన వారు మాత్రం ఖచ్చితంగా ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా వాయిదా పక్కా అంటున్నారు.

మీడియాలో.. ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న పుకార్లను చిత్ర యూనిట్‌ సభ్యులు నిజం చేసేలా ఉన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఉక్రెయిన్ నుండి ఇండియాకు వచ్చిన వెంటనే జక్కన్న అండ్‌ టీమ్‌ ప్రెస్ మీట్‌ ఏర్పాటు చేయబోతున్నారు. షూటింగ్ ను ముగించినట్లుగా అధికారికంగా ప్రకటించడంతో పాటు విడుదలకు సంబంధించిన కొత్త తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతానికి దసరాకు సినిమా రెడీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీపావళి.. క్రిస్మస్‌ మరియు సంక్రాంతి సినిమాలు ఫిక్స్ అయ్యాయి. కనుక సినిమా విడుదల తేదీని నిర్ణయించడం అంటే చాలా పెద్ద టాస్క్‌. మరి ఈ టాస్క్‌ ను జక్కన్న ఎలాంటి నిర్ణయం తీసుకుని పూర్తి చేస్తాడు అనేది అందరిలో సస్పెన్స్ గా ఉంది.

బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా అవ్వడం తో దేశ వ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు జక్కన్న ఇద్దరు సూపర్‌ స్టార్‌ లతో ఈ సినిమాను తెరకెక్కించాడు. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను సాధించడంతో పాటు హాలీవుడ్ లో కూడా ఈ సినిమా ఆడుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. పలు దేశాల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచేలా ఉంటుందని అంటున్నారు. ఇలాంటి సినిమాను మంచి టైమ్ చూసి విడుదల చేయాలి. కనుక కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కాని ఇప్పటికి కొందరు అభిమానులు మాత్రం అక్టోబర్‌ కోసం వెయిట్‌ చేస్తున్నామంటున్నారు.