Begin typing your search above and press return to search.

తెలుగు మీడియాను విస్మరిస్తూ వస్తోన్న RRR టీమ్..?

By:  Tupaki Desk   |   7 April 2022 3:46 PM GMT
తెలుగు మీడియాను విస్మరిస్తూ వస్తోన్న RRR టీమ్..?
X
ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కు రుచి చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ఏరియాల్లోనూ ట్రిపుల్ ఆర్ మూవీ భారీ వసూళ్లు అందుకుంటోంది. ఈ సంగతి పక్కన పెడితే RRR మేకర్స్ మొదటి నుంచీ కూడా తెలుగు మీడియాను విస్మరిస్తూ వస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి.

RRR సినిమా కోసం జక్కన్న అండ్ టీమ్ గట్టిగానే ప్రమోషన్లు చేశారు. రిలీజ్ కు ముందు దేశ వ్యాప్తంగా పర్యటించి అన్ని భాషల వారికీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ తెలుగు మీడియా విషయనికొచ్చే సరికి రికార్డెడ్ ఇంటర్వ్యూలు.. మీడియా వాళ్లతో సంబంధం లేని ఇంటర్వ్యూలు వదిలారు. ఇందులో ప్రింట్ మీడియా.. ఎలక్ట్రానిక్ - వెబ్ మీడియాలతో ఇంటరాక్షన్ లేదు.

విడుదలకు ముందు కొన్ని టీవీ ఛానళ్లని పిలిచి తూ.తూ మంత్రంగా ఏదో ప్రెస్ మీట్ పెట్టారంతే. ఇక ప్రింట్ మీడియాకైతే ఒక్క ఇంటర్వ్యూ కూడా లేదు. సినిమా రిలీజైన తర్వాత ప్రెస్ మీట్ ఏదీ పెట్టలేదు. బ్లాక్ బస్టర్ అయినా కూడా అలాంటిదేమే లేదు. సక్సెస్ అయిన తర్వాత చిత్ర బృందం పెద్దగా ప్రమోషన్స్ చేయలేదనే అనుకోవాలి. ఇటీవల ఎన్టీఆర్ - చరణ్ - రాజమౌళి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అవి కూడా బాలీవుడ్ కు చెందిన వెబ్ పోర్టల్ కు ఇచ్చినవే.

నైజాంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమా 100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టిన నేపథ్యంలో హైదరాబాద్ లో సక్సెస్ పార్టీని నిర్వహించారు. దీనికి తెలుగు మీడియాను ఆహ్వానించలేదు. మీడియాను ఆహ్వానించని కొన్ని ఈవెంట్లు ఉంటాయి కాబట్టి.. దాన్ని మామూలు విషయంగానే తీసుకోవచ్చు. కానీ ముంబైలో జరిపిన సక్సెస్ పార్టీకి మాత్రం బాలీవుడ్ మీడియాని ఆహ్వానించడమే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.

ముంబైలో జరిగిన RRR ఈవెంట్ కు ఢిల్లీ - కోల్ కతా వంటి దేశంలోని ఇతర ప్రాంతాల నుండి కొంతమంది మీడియా పర్సన్స్ కు విమాన టిక్కెట్లు మరియు వసతి ఏర్పాటు చేసి మరీ రప్పించారట. అంతేకాదు మీడియా ఇంటరాక్షన్ కూడా ఏర్పాటు చేసి వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ట్రిపుల్ ఆర్ టీమ్. దీనిని బట్టి ఎందుకనో తెలుగు మీడియాను విస్మరిస్తున్నట్టు అనిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెయినింగ్స్ కు డోకా లేదు కాబట్టి ఇక్కడ ప్రీ-రిలీజ్ ప్రమోషన్లు తక్కువగా చేసారని అనుకోవచ్చు. కానీ విడుదల తర్వాత.. ఇప్పుడు సక్సెస్ అయినాక కూడా తెలుగు మీడియాకు దూరంగానే ఉంటున్నారు. హిందీ మీడియాతో మాట్లాడటం వల్ల గౌరవం దక్కడం మాట అటుంచి.. అసౌకర్యమైన ప్రశ్నలు అసంబద్ధమైన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

మీడియా ఇంటరాక్షన్ లో ఒక బాలీవుడ్ జర్నలిస్ట్ 'సినిమాకు ప్రశంసలన్నీ మీరే అందుకోవడం చూస్తుంటే ఎలా అనిపిస్తోంది?' అని తారక్ సమక్షంలో చరణ్ ను అడిగింది. ఒక హీరో ముందు ఇలా అడగడం వల్ల సినిమా కోసమే అంకితమై కొన్నేళ్లపాటు కష్టపడిన ఏ స్టార్ కైనా బాధ అనిపిస్తుంది. తెలుగు మీడియా అయితే ఖచ్చితంగా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగదు.

ఒకటీ అర సంఘటనలు మినహాయించి టాలీవుడ్ స్టార్స్ తో తెలుగు మీడియా చాలా బాగా మెలుగుతుంది. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నప్పుడు ఇతర భాషల మీడియా వారితో ఇంటరాక్ట్ అవడం అవసరమే. కానీ స్థానిక మీడియాను.. ఇన్నాళ్లు తమను ప్రమోట్ చేస్తూ వచ్చిన సొంతవారిని విస్మరించడం సరైనదేనా అని పాన్ ఇండియా ఫిలిం మేకర్స్ - స్టార్స్ ఆలోచించాలి.