Begin typing your search above and press return to search.

కేరళకి రెండు పవర్ హౌస్ లు తీసుకొస్తున్నాను: రాజమౌళి

By:  Tupaki Desk   |   29 Dec 2021 3:26 PM GMT
కేరళకి రెండు పవర్ హౌస్ లు తీసుకొస్తున్నాను: రాజమౌళి
X
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' మలయాళంలోను భారీస్థాయిలో విడుదల కానుంది. అందువలన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను కొంత సేపటికి క్రితం 'త్రివేండ్రం'లో నిర్వహించారు. తోవినో థామస్ ముఖ్య అతిథిగా ఈ వేడుక జరిగింది. ఈ స్టేజ్ పై రాజమౌళి మాట్లాడుతూ .. "అందరికీ నమస్కారం .. ముందుగా మా నిర్మాత డీవీవీ దానయ్య గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. దానయ్యగారు నాకు 13 సంవత్సరాల క్రితం అడ్వాన్స్ ఇచ్చారు. మధ్యలో 'మర్యాద రామన్న' వంటి సినిమాలు చేయవచ్చు. కానీ నాతో పెద్ద సినిమానే చేయాలనే ఉద్దేశంతో ఆయన వెయిట్ చేస్తూ వచ్చారు.

చివరికి ఆయన అనుకున్నట్టుగానే నాతో ఈ బిగ్గెస్ట్ సినిమా .. మల్టీస్టారర్ మూవీ చేశారు. ఎంతో కాలంగా నా కోసం వెయిట్ చేస్తూ వచ్చిన దానయ్య గారికి నేను మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ఈ సందర్భంగా నేను శిబూ సార్ కి కూడా థ్యాంక్స్ చెబుతున్నాను. మలయాళ హక్కులు తన స్నేహితుడు తీసుకున్నాడని దానయ్య గారు చెబుతూ ఉంటే ఎవరో అనుకున్నాను. తీరా చూస్తే అది శిబూ సార్ .. ఆయన నాకు ఇంతకుముందే తెలుసు .. మా ఫాదర్ కి కూడా ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్. సడెన్ గా నాకు శిబూ సార్ ఇక్కడ కనిపిస్తే నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు చెప్పాడు ఆయన .. తను ఈ సినిమా మలయాళ హక్కులు తీసుకున్నట్టు.

ఆయనకి సినిమాల పట్ల గల ప్యాషన్ గురించి నాకు తెలుసు. 'ఆర్ ఆర్ ఆర్' మంచివాళ్ల చేతుల మీదుగా ముందుకు వెళుతున్నందుకు సెక్యూర్ గా ఫీలయ్యాము. ఒక సినిమా దర్శకుడికి తన సినిమా అన్ని వైపులకు వెళ్లడం కంటే ఆనందం ఏవుంటుంది? గత పదేళ్లుగా నా సినిమాలు హిట్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 'బాహుబలి' .. 'బాహుబలి 2' రెండిటినీ కూడా కేరళ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. 'ఆర్ ఆర్ ఆర్'కు అంతకు మించిన సపోర్టును ఇస్తారని భావిస్తున్నాను.

కేరళకి రెండు సూపర్ పవర్ హౌస్ లను తీసుకుని వస్తున్నాను. వాళ్లిద్దరూ నా బ్రదర్స్ .. నా ఫ్రెండ్స్ .. నా ఫ్యామిలీ మెంబర్స్ .. వాళ్లే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్. కేరళతో నాకు మంచి అనుబంధం ఉంది. నా ఫస్టు సినిమా 'స్టూడెంట్ నెంబర్ 1' అయినప్పటికీ, రియల్ సక్సెస్ మాత్రం కేరళ నేపథ్యంలో నడిచే 'సింహాద్రి'తోనే వచ్చింది. ఆ సినిమా కోసం కేరళలో 20 నుంచి 25 రోజుల వరకూ షూటింగ్ చేశాము. మళ్లీ ఇంతకాలానికి ఇక్కడికి వచ్చినందుకు ఆ జ్ఞాపకాలతో మాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇక చరణ్ 'మగధీర' కూడా కేరళలో విడుదలై మంచి సక్సెస్ ను సాధించింది. 'మగధీర'కు మించిన రెస్పాన్స్ 'ఆర్ ఆర్ ఆర్'కి వస్తుందని భావిస్తున్నాను. మరోసారి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను" అంటూ ముగించారు.