Begin typing your search above and press return to search.

'RRR'పై తెలంగాణ హైకోర్టులో పిల్‌

By:  Tupaki Desk   |   5 Jan 2022 1:32 PM GMT
RRRపై తెలంగాణ హైకోర్టులో పిల్‌
X
మెగా ప‌వ‌ర్ ప‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ , యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్క‌రించిన ఈ మూవీ ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 1920లో దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిపై పోరాటం చేసిన మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు, గోండు బెబ్బులి కొమ‌రం భీం వంటి ఇద్ద‌రు వీరుల క‌థ‌గా ఫిక్ష‌న‌ల్ అంశాల‌ని జోడించి ఆనాటి పోరాటాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించే ప్ర‌య‌త్నంలో భాగంగా రాజ‌మౌళి ఈ మూవీని రూపొందించారు.

ఈ నెల 7న ప్ర‌పంచ వ్యాప్తంగా 14 భాష‌ల్లో విడుద‌ల కావాల్సిన ఈ మూవీ రిలీజ్ ని దేశ వ్యాప్తంగా అనూహ్యంగా మారుతున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. రిలీజ్ కోసం క‌ష్టాలు ప‌డుతున్న ఈ మూవీకి తాజాగా మ‌రో భారీ బ్రేక్ ప‌డ‌బోతోంది. ద‌ర్శ‌కుడు రాజమౌళి చ‌రిత్ర‌ని వ‌క్రీక‌రించి ఈ మూవీని తీశార‌ని ఆరోప‌ణ‌లు చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఆంధ్ర ప్ర‌దేశ్ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా స‌త్య‌వ‌ర‌పు ఉండ్రాజ‌వరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్ వేశారు.

త‌న పిటీష‌న్ లో `కావాల‌నే చ‌రిత్ర‌ని వ‌క్రీక‌రించార‌ని, లెజెండ‌రీ ఫ్రీడమ్ ఫైట‌ర్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం ఫాలోవ‌ర్స్ ని అవ‌మానించార‌ని పేర్కొంది. అంతే కాకుండా త‌న పిటీష‌న్ లో మ‌రో రెండు డిమాండ్ ల‌ని చేసింది. ఈ సినిమా కు సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌రాద‌ని, అంతే కాకుండా ఈ మూవీని రిలీజ్ చేయాడానికి వీళ్లేద‌ని అందుకు స్టే విధించాల‌ని కోరింది.

అల్లురి సౌమ్య వేసిన‌ పిల్ జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భుయాన్‌, జ‌స్టిస్ వెంక‌టేశ్వ‌ర‌రెడ్డిల ధ‌ర్మాస‌నానికి చేరింది. ఈ సంద‌ర్‌బంగా జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భుయాన్ ధ‌ర్మాస‌నం పిల్ ని విచారిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. రాజ‌మౌళి ముందే ఇది ఫిక్ష‌న‌ల్ స్టోరీ అని స్వాతంత్య్ర స‌మ‌రంలో కొంత కాలం అల్లూరి సీతారామరాజు, కొమురం భీం క‌నిపించ‌కుండా పోయార‌ని ఆ స‌మ‌యంలో వారు ఎక్క‌డ వున్నారు? ఏం చేశార‌న్న‌ది ఎవ‌రికీ తెలియ‌ద‌ని ఆ కాలాన్నే క‌థ‌గా ఎంచుకుని ఓ ఫిక్ష‌న‌ల్ స్టోరీని ఆ పాత్ర‌ల‌కు అన్వ‌యించి `మోట‌ర్ సైకిల్ డైరీస్‌` సినిమా స్ఫూర్తితో ఈ మూవీ చేస్తున్నాన‌ని ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన రోజే రాజ‌మౌళి స్ప‌ష్టం చేశారు.

జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కావాల్సిన ఈ మూవీ థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రిలీజ్ పై ఓ మ‌హిళ పిల్ వేయ‌డంతో ఈ మూవీ మ‌రో సారి చిక్కుల్లో ప‌డింది. అయితే రాజ‌మౌళి ముందే ఇదొక ఫిక్ష‌న‌ల్ స్టోరీ అని క్లారిటీ ఇచ్చిన నేప‌థ్యంలో తెలంగాణ హైకోర్టు ధ‌ర్మాస‌నం ఈ సినిమాపై ఎలాంటి తీర్పుని ఇవ్వ‌నుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.