Begin typing your search above and press return to search.

రూ.85 కోట్లతో 'రాధేశ్యామ్‌'లో దాన్ని దించేశారట

By:  Tupaki Desk   |   6 Nov 2021 5:30 AM GMT
రూ.85 కోట్లతో రాధేశ్యామ్‌లో దాన్ని దించేశారట
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన రాధే శ్యామ్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సాహో సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఈ సినిమా పట్టాలెక్కింది. సాహో విడుదల సమయంలో ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ఆ తర్వాత కంటిన్యూస్ గా చేస్తున్న సమయంలో కరోనా వచ్చింది. దాంతో దాదాపుగా ఏడాదిన్నర ఆలస్యంగా సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతి బరిలో రాధేశ్యామ్‌ నిలువబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా అదే సంక్రాంతికి వస్తున్న నేపథ్యంలో రాధేశ్యామ్‌ విడుదల తేదీ మారే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. ఈ సమయంలో సినిమాకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా సినిమా సెట్స్ కు సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో గుప్పుమంటోంది.

యూనిట్ సభ్యులు మరియు ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు గాను యూవీ క్రియేషన్స్ వారు భారీ మొత్తంలో ఖర్చు చేయడం జరిగింది. అందులో మెజార్టీ శాతం సెట్టింగ్స్ కోసం ఖర్చు చేశారట. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏకంగా రూ.85 కోట్ల రూపాయలను సెట్టింగ్ ల కోసం వినియోగించారని అంటున్నారు. 1980 కాలం నాటి యూరప్‌ ను కళ్లకు కట్టినట్లుగా చూపించడం కోసం దాదాపుగా వందకు పైగా సెట్టింగ్స్ నిర్మాణం చేశారట. ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఏదో ఒక సెట్టింగ్‌ లోనే ఉంటుందని అంటున్నారు. అప్పటి కాలం నాటి పరిజ్ఞానంతో ఉపయోగించిన వస్తువులను ఇప్పుడు రీ క్రియేట్‌ చేయడం కోసం చాలా ఖర్చు అయ్యిందని అంటున్నారు. ఒక సన్నివేశంలో రైలు మొదలుకుని ప్రతి ఎలిమెంట్ ను కూడా తయారు చేయించారు. అలా అన్ని సీన్స్ లో కూడా భారీ ఎత్తున పరికరాలు.. వస్తువులను రీ క్రియేట్ చేయడం జరిగిందట.

అప్పటి కాలంను కళ్లకు కట్టినట్లుగా చూపించడం కోసం రాధేశ్యామ్‌ నిర్మాతలు ఏకంగా రూ.85 కోట్లకు పైగా ఖర్చు చేశారనే వార్తలు వస్తున్నాయి. ఇక భారీ స్టార్ కాస్టింగ్ మరియు సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించుకున్న నేపథ్యంలో సినిమాకు భారీ ఎత్తున ఖర్చు అయినట్లుగా చెబుతున్నారు. రికార్డు బ్రేకింగ్ స్థాయిలో ఈ సినిమా కోసం ఖర్చు చేసిన మేకర్స్ అంతే స్థాయిలో వసూళ్లు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ప్రభాస్ విక్రమాధిత్య పాత్రలో కనిపించబోతున్నాడు. జాతకాలు చెప్పే అత్యాధునిక జ్యోతిష్యుడిగా ప్రభాస్ కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే గ్లిమ్స్ ద్వారా తెలియజేశారు. త్వరలోనే టీజర్ రాబోతుంది.. ఆ టీజర్ లో సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను రివీల్‌ చేస్తారేమో చూడాలి. తెలుగు తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. విదేశాల్లో కూడా భారీ ఎత్తున ఈ సినిమాను విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.