Begin typing your search above and press return to search.

వ‌ర‌ల్డ్ సినిమాని స్ట‌డీ చేసొచ్చాడు!

By:  Tupaki Desk   |   17 Sep 2018 1:30 AM GMT
వ‌ర‌ల్డ్ సినిమాని స్ట‌డీ చేసొచ్చాడు!
X
ఈయ‌నేదో కొబ్బ‌రి నూనె రాసుకుని - ప‌క్క‌పాపిడి దువ్వుకున్న కృష్ణాన‌గ‌ర్ బ్యాచీ కుర్రాడు అనుకునేరు. ప‌క్కాగా ఫిలింస్టడీ పూర్తి చేసి ట్యాలెంటుతో ఇక్క‌డ అడుగుపెట్టాడు. రామానాయుడు ఫిలింస్కూల్‌ లో ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్టిఫికెట్ అందుకుని అదృష్టం చెక్ చేసుకుంటున్నాడు. ల‌ఘు చిత్రాల‌తో ఆక‌ట్టుకుని - పెద్ద ద‌ర్శ‌కుడ‌వ్వాల‌ని అంద‌రిలానే క‌ల‌లుగ‌న్నాడు. తొలి ప్ర‌య‌త్న‌మే సుధీర్ బాబుతో అవ‌కాశం అందుకున్నాడు. పేరు ఆర్‌.ఎస్‌.నాయుడు. ఊరు అనంత‌పురం- తాడిప‌త్రి. సుధీర్ బాబు క‌థానాయ‌కుడిగా `న‌న్ను దోచుకుందువ‌టే` చిత్రాన్ని తెర‌కెక్కించాడు. సుధీర్‌ బాబు ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై సుధీర్ స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 21న ఈ సినిమాను విడుద‌లకు రెడీ అవుతున్న సంద‌ర్భంగా ఆర్‌.ఎస్‌.నాయుడుతో మీడియాతో చాలా సంగ‌తులే ముచ్చ‌టించాడు.

సినిమా సంగ‌తులు చెబుతూ - ఈ చిత్రంలో హీరో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో మేనేజ‌ర్‌. అమెరికా వెళ్లాల‌ని క‌లలు కంటుంటాడు. దాన్ని సాకారం చేసుకోవాల‌న్న య‌త్నంలోనే అత‌నికి ఓ అమ్మాయి ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆమె ప‌రిచ‌యం అత‌నిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? చివ‌రికి అనుకున్న ల‌క్ష్యం సాధించ‌గ‌లిగాడా? లేదా? అనేది సినిమా. ఇదో రొమాంటిక్ కామెడీ. పూర్తి వినోదాత్మ‌కంగా ఉంటుంది. నిజ జీవితంలో సుధీర్‌ బాబు ఎలా ఉంటారో ఈ సినిమాలోనూ అలాగే ఉంటారు. నా జీవితంలో జ‌రిగిన కొన్ని అంశాల‌ను ఇందులో చూపిస్తున్నా. ఈ చిత్రంలో నాజ‌ర్‌ గారి పాత్ర‌ను మా నాన్న స్వ‌భావాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్నా. క‌థానాయిక పాత్ర చాలా బ‌ల‌మైన‌ది. ఎంద‌రినో ప‌రిశీలించి చివ‌ర‌కు న‌భా న‌టేష్ చ‌క్క‌గా స‌రిపోతుంద‌నిపించి ఎంపిక చేసుకున్నానని తెలిపాడు.

చిన్న‌ప్ప‌టి నుంచి సినిమా పిచ్చి. ఫిలింస్కూల్‌ లో చ‌దివేప్పుడు వ‌ర‌ల్డ్ సినిమా అంటే చాలా ఉంద‌ని అర్థం చేసుకున్నా. నీ మాయ‌లో - స్పంద‌న‌ అని రెండు షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా చాలా ప్ర‌య‌త్నాలు చేశాను. అందులో భాగంగానే సుధీర్‌ బాబును క‌లిసి ఓకే చేయించుకున్నాన‌ని త‌న ప‌య‌నం గురించి ఆస‌క్తిక‌ర సంగ‌తులు తెలిపాడు. ఈ న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడి తొలి ప్ర‌య‌త్నం స‌ఫ‌ల‌మ‌వ్వాల‌ని ఆకాంక్షిద్దాం.