Begin typing your search above and press return to search.

అనుష్క vs అనుష్క.. గిమ్మిక్కేనా?

By:  Tupaki Desk   |   28 Sep 2015 5:30 PM GMT
అనుష్క vs అనుష్క.. గిమ్మిక్కేనా?
X
అప్పుడెప్పుడో 90ల్లో నందమూరి బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు బంగారు బుల్లోడు - నిప్పు రవ్వ ఒకేసారి విడుదలయ్యాయి. అప్పట్లో అదో పెద్ద సంచలనం. ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది నాని సినిమాలు ఎవడే సుబ్రమణ్యం - జెండాపై కపిరాజు ఉగాది రోజు ఒకేసారి విడుదలవడం పెద్ద షాక్. ఇప్పుడు అనుష్క కూడా ఇదే ఫీట్ దిశగా అడుగులేస్తోంది. ఆమె నటించిన రెండు ప్రెస్టీజియస్ మూవీస్ రుద్రమదేవి - సైజ్ జీరో ఒకే రోజు విడుదలవుతాయన్నది ప్రస్తుతానికి ఉన్న సమాచారం.

నాని విషయంలో చూస్తే.. అతడి ఫోకస్ అంతా ‘ఎవడే సుబ్రమణ్యం’ మీదే ఉంది. ‘జెండాపై కపిరాజు’పై ఎలాగూ ఆశల్లేవు, ఆ సినిమా విడుదలైతే చాలనుకున్నాడు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. కానీ అనుష్క సంగతి అలా కాదు.. రుద్రమదేవి - సైజ్ జీరో రెండూ కూడా ఆమెకు రెండు కళ్లలాంటివి. రెండు సినిమాలకూ విపరీతంగా కష్టపడింది జేజెమ్మ. రుద్రమదేవి కోసం యుద్ధవిద్యలు నేర్చుకుని రెండేళ్లకు పైగా షూటింగులో పాల్గొంది. ఇక ‘సైజ్ జీరో’ కోసం ఒళ్లు పెంచి, తగ్గించి చాలా శ్రమ పడింది. కాబట్టి ఆమెకు ఏ సినిమా కూడా తక్కువ కాదు. రెండూ ప్రతిష్టాత్మకమే.

ముందు సైజ్ జీరో సినిమాను అక్టోబరు 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ తర్వాతి వారమే రుద్రమదేవి విడుదల అనేసరికి వాయిదా వేసుకున్నారు. అలాంటిది మళ్లీ ‘రుద్రమదేవి’కే పోటీగా వెళ్లడమేంటో అర్థం కావడం లేదు. చూస్తుంటే.. అనుష్కకు - గుణశేఖర్‌కు విభేదాలన్న మాట నిజమే అనిపించేలా ఉంది వ్యవహారం. ఐతే రుద్రమదేవి - సైజ్ జీరో రెండూ ఒకేసారి రావడం వల్ల రెంటికీ కచ్చితంగా నష్టమే. ఎందుకంటే రెంటి మీదా మంచి అంచనాలున్నాయి.

గుణశేఖర్ కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని అతడికి సైడిచ్చేస్తే బెటర్. లేదంటే తర్వాతి వారం ‘బ్రూస్ లీ’ వస్తోంది కాబట్టి అతనే సైడైపోయి నవంబర్లో మంచి డేటు చూసుకున్నా మంచిదే. రుద్రమదేవి, సైజ్ జీరో ఒకే రోజు పోటీ పడటం మాత్రం మంచిది కాదు. ఐతే నిర్మాతలకు బయటి వాళ్లు చెబితే తప్ప ఈ సంగతి తెలియందేమీ కాదు కదా. అయినా పట్టనట్లు ఉన్నారంటే ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్న గిమ్మిక్కేమో అన్న డౌట్ కుడా వస్తోంది జనాలకు. కొన్నాళ్లు మీడియాలో ఈ వ్యవహారం నలిగాక.. ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటన వస్తే ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు.