Begin typing your search above and press return to search.

ఆ సినిమా నన్ను మగజాతి ఆణిముత్యం చేసింది

By:  Tupaki Desk   |   3 April 2020 3:30 AM GMT
ఆ సినిమా నన్ను మగజాతి ఆణిముత్యం చేసింది
X
జీవితంలో కొన్ని సంఘటనలు చాలా జీవితాలపై కోలుకోలేని ప్రభావాన్ని చూపిస్తాయి. అందులో ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన సంఘటనలు జీవితంలో మర్చిపోలేం. అలాంటి జీవితాలలో విషాదం నిండి వారి కథలు యదార్ధంగా ముగుస్తాయి. అలాంటి జీవిత గాథలను సినిమాలుగా తెరకెక్కించే దర్శకులు అరుదుగా దొరుకుతారు. అలాంటి దర్శకులలో ఒకరు, రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి ఈ సినిమా కథకు నాంది తన జీవితంలో జరిగిన ఘటనలే అని ఇంతకుముందే వెల్లడించాడు. తాను ఓ అమ్మాయి చేతిలో మోసపోయానని, ఆ అనుభవంతో ఆమెకు బుద్ధి చెప్పడం కోసం ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా తీశానని అజయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన అజయ్. ఆయనతో కలిసి ‘ఎటాక్’ సినిమాకు పని చేస్తుండగా ఓ అమ్మాయి చేతిలో తాను మోసపోయినట్లు అతను వెల్లడించాడు.

ఆ అమ్మాయి ప్రభావంతో జీవితంలో బాగా డిస్టర్బ్ అయి పనిలో నిమగ్నం కాలేకపోయాను. అయితే ఓ మిత్రుడు సలహా మేరకు తాను తన వ్యక్తిగత అనుభవాల నేపథ్యంలోనే ‘ఆర్ ఎక్స్ 100’ కథ రాశానని చెప్పాడు. అయితే హీరో పాత్ర చిత్రణ కోసం చనిపోయిన తన మిత్రుడు శివ లైఫ్ స్టైల్‌ను స్ఫూర్తిగా తీసుకున్నానని, అంతే తప్ప అతడికి ఈ కథకు ఎలాంటి సంబంధం లేదని అజయ్ తెలిపాడు. సినిమా చివరలో శివ ఫొటో వేసేసరికి హీరో పాత్రకు ఇన్‌ స్పిరేషన్ అతడి కథే అని జనాలు అపార్థం చేసుకున్నారని చెప్పాడు. ఇదిలా ఉండగా ‘ఆర్‌ ఎక్స్ 100’ సినిమా చూసిన ఓ ప్రేక్షకుడు ‘నువ్వు మగజాతి ఆణిముత్యం’ అని కామెంట్ చేశాడట. అది తనకు దక్కిన గొప్ప ప్రశంస అని సర్దిచెప్పుకొచ్చాడు డైరెక్టర్. ఇక తనను మోసం చేసిన అమ్మాయి ఈ సినిమా గురించి వేరే వాళ్ల దగ్గర మాట్లాడుతూ.. ‘అదో సినిమా.. వాడో డైరెక్టర్’ అని అందట. అది కూడా మరో పెద్ద కాంప్లిమెంట్‌గా తీసుకున్నానని అజయ్ నవ్వుతూ బదులిచ్చాడట.