Begin typing your search above and press return to search.

గాన కోకిల గొంతు మూగ‌బోయింది!

By:  Tupaki Desk   |   29 Oct 2017 4:58 PM GMT
గాన కోకిల గొంతు మూగ‌బోయింది!
X
ఆ గొంతు.....గోవుల్లు తెల్ల‌నా...గోధూళి ఎర్ర‌న‌....గోప‌య్య న‌ల్ల‌నా ఎందువ‌ల‌న‌.....అంటూ ఆరేళ్ల బాలుడి స్వ‌రంలో ఆబాల గోపాలాన్ని అల‌రించింది. సిరిమ‌ల్లె పువ్వా....సిరిమ‌ల్లె పువ్వా....చిన్నారి చిల‌క‌మ్మా....నావాడు ఎవ‌డే...నాతోడు ఎవ‌డే...అంటూ.....కౌమార ద‌శ‌లో ఉన్న ఓ యువ‌తి భావాల‌ను ప‌లికించింది. అమ్మా అని పిలిచి పిలిచి గుండె పిండ‌కురా.....ఆక‌ల‌ని ఏడ్చి న‌న్ను ఏడిపించ‌కురా.....అంటూ ఓ మాతృమూర్తి ఆవేద‌న‌ను ఆర్ధ‌త‌తో పాడింది. త‌న స్వ‌ర మాధుర్యంతో తెలుగు - త‌మిళం - మ‌ల‌యాళం -క‌న్న‌డ‌ - హిందీ ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించిన‌ గాన కోకిల గొంతు ఇక‌పై మూగ‌బోనుంది. త‌న 60 ఏళ్ల స్వ‌ర‌ ప్ర‌స్థానంలో 17 భాష‌ల‌లో 48 వేల పాట‌లు పాడిన నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా గానానికి వీడ్కోలు ప‌లికింది. ముందుగా ప్ర‌క‌టించిన ప్ర‌కార‌మే లెజెండ‌రీ సింగ‌ర్ ఎస్ .జాన‌కి శ‌నివారం మైసూరులో త‌న ఆఖరి పాట‌ను పాడింది. త‌న సుస్వర ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన మైసూరులోనే ముగింపు పలికిందా గాన స‌రస్వ‌తి.

గాన కోకిల జాన‌కి చివ‌ర‌గా గ‌త సంవ‌త్స‌రం ఓ మ‌ల‌యాళ చిత్రానికి నేప‌థ్య గానం చేశారు. అదే త‌న చివ‌రి పాట అని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ఆమె వేదికలపై ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను కూడా నిలిపివేశారు. అయితే, ఆమె వీరాభిమానులు ప్రవీణ్‌, పవన్‌, నవీన్‌ల విన్నపం ప్ర‌కారం ఓ స్వచ్ఛంద సంస్థకు సహాయాన్ని అందించేందుకు చివరిసారిగా పాడేందుకు ఆమె అంగీకరించారు. మైసూరులో శనివారం రాత్రి జరిగిన తన చివరి సంగీత విభావరిలో పాల్గొని ఆహూతుల‌ను అల‌రించారు. మైసూరులో ప్రారంభించిన తన‌ ప్రస్థానానికి అక్క‌డే ముగింపు పలికారు. దివంగత గాయకుడు పి.బి.శ్రీనివాస్‌తో కలిసి జానకి 1952లో మైసూరు నుంచే పాటలను పాడ‌డం ప్రారంభించ‌డం విశేషం. ఆ లెజెండ‌రీ సింగ‌ర్ చివ‌రి ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించేందుకు వేలాదిమంది సంగీతాభిమానులు తరలివచ్చి ప్రత్యక్షంగా ఆమె పాటలను విని పులకించారు. ఈ సందర్భంగా రాజవంశస్థురాలు ప్రమోదా దేవి ఒడయరు, మాజీ మంత్రి జి.టి.దేవెగౌడ, అలనాటి నాయికలు జయంతి, భారతీ విష్ణువర్ధన్‌లు జాన‌కిని ఘనంగా సత్కరించారు. జాన‌కి గాన మాధుర్యానికి గానూ ఆమెను ప‌లు అవార్డులు వ‌రించాయి. ఈ లెజెండ‌రీ సింగ‌ర్ 4 సార్లు జాతీయ ఉత్త‌మ గాయ‌నిగా ఎంపికైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌ర‌పున 4 నంది అవార్డుల‌తో పాటు వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి 40 రాష్ట్ర స్థాయి అవార్డుల‌ను సొంతం చేసుకుంది. క‌ళారంగానికి ఆమె చేసిన విశిష్ట సేవ‌ల‌కు గుర్తింపుగా 2013లో ఆమెకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డును ప్ర‌క‌టించింది. అయితే, ద‌క్షిణాది క‌ళాకారుల‌పై కేంద్రం చిన్న‌చూపు చూస్తోంద‌ని, త‌న‌కు ఆ గౌర‌వం ఆల‌స్యంగా ద‌క్కింద‌నే కార‌ణాల‌తో జాన‌కి ఆ అవార్డును సున్నితంగా తిర‌స్క‌రించారు.