Begin typing your search above and press return to search.

అలా చేస్తే మా నాన్న బ్రతికేవాడేమో: తమన్

By:  Tupaki Desk   |   22 Dec 2021 6:32 AM GMT
అలా చేస్తే మా నాన్న బ్రతికేవాడేమో: తమన్
X
టాలీవుడ్ సంగీత దర్శకులలో తమన్ తనదైన దూకుడు చూపుతున్నాడు. స్టార్ హీరోలంతా ఇప్పుడు ఆయన పేరునే జపిస్తున్నారు. పెద్ద పెద్ద బ్యానర్లు ఆయన కోసం వెయిట్ చేయడానికి సిద్ధపడుతున్నాయి. అలా అంతగా తమన్ పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడం వెనుక కేవలం ఇష్టం .. పట్టుదల మాత్రమే కాదు, కావాల్సినంత కసి కనిపిస్తుంది. కష్టాలు అనుభవాలుగా మారినప్పుడు .. ప్రతి రోజు ఒక పాఠమే అవుతుంది. అలాంటి పాఠాలను చదువుకుంటూ .. వాటిని గుర్తుపెట్టుకుంటూ తమన్ ముందుకు సాగాడు. అదే ఆయనను ఈ రోజున ఈ స్థాయికి తీసుకు వచ్చిందనేది ఆయన జీవితాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది.

'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తమన్ పాల్గొనగా, అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం రన్ అవుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ఆయన చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడనే విషయం అర్థమవుతోంది. తన జీవితంలో తనకి ఎదురైన ఒక సంఘటనను గురించి తమన్ చెప్పడం పై ఆ ప్రోమోను కట్ చేశారు. ఆ షోలో తమన్ తన చిన్నప్పుడు తండ్రితో కలిసి చివరిసారిగా దిగిన ఫొటోను చూపించారు. అప్పుడు తమన్ మాట్లాడుతూ .. "మా ఫ్యామిలీ ఢిల్లీలో ఉన్న మా అత్తయ్య వాళ్లింటికి వెళ్లినప్పుడు అక్కడ దిగిన ఫొటో అది. ఆ ఫొటోను మా చెల్లెలే తీసింది. ఆ తరువాత మేమంతా రాజధాని ఎక్స్ ప్రెస్ లో మా ఊరికి బయలుదేరాము.

ట్రైన్ లో మేమంతా తిరిగి వస్తుండగా మా నాన్నగారికి గుండెపోటు వచ్చింది. ట్రైన్ చాలా వేగంగా వెళుతోంది. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ట్రైన్ ఆగిన తరువాత ఎదురుగా జనరల్ హాస్పిటల్ కనిపించింది. కానీ అక్కడికి కాకుండా మేము వేరే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాము. అలా వెళుతూ ఉండగానే ఆయన చనిపోయారు. అలా ఆలస్యం చేయకుండా అందుబాటులో ఉన్న ఆ జనరల్ హాస్పిటల్ కి ఆయనను తీసుకెళితే బ్రతికేవారేమో. నాన్న చనిపోయిన తరువాత నేను ఆయన గురించి ఎక్కువగా ఆలోచించలేదు .. నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి? అనే ఆలోచించాను.

నాన్న చనిపోయిన తరువాత ఆయనకి సంబంధించి ఎల్ ఐసి నుంచి 60 వేల వరకూ వచ్చాయి. ఆ డబ్బును మా అమ్మ ఇంట్లో వాడకుండా నాకు ఇష్ఠమైన డ్రమ్స్ ను కొనిపెట్టింది. నాన్న కూడా మంచి డ్రమ్మర్ .. చాలా సినిమాలకు ఆయన పనిచేశారు. అందువల్లనే నాకు డ్రమ్స్ వాయించడం పట్ల ఆసక్తి పెరుగుతూ వెళ్లింది. నా ఆసక్తిని అర్థం చేసుకునే మా అమ్మ నాకు వాటిని కొనిపెట్టింది. ఆ డ్రమ్స్ మేము బ్రతడానికి దారి చూపించాయి. చాలామంది సంగీత దర్శకుల దగ్గర డ్రమ్మర్ గా పనిచేశాను. ఒక డ్రమ్మర్ గా నేను పనిచేసిన తొలి సినిమా 'భైరవద్వీపం'. ఆ సినిమాకి గాను నేను మొదటిసారిగా అందుకున్న పారితోషికం 30 రూపాయాలు" అని చెప్పుకొచ్చాడు.