Begin typing your search above and press return to search.

ఇంట్లో జరిగే ట్రోలింగ్ ముందు ఇదెంత?: తమన్

By:  Tupaki Desk   |   23 Dec 2021 1:30 AM GMT
ఇంట్లో జరిగే ట్రోలింగ్ ముందు ఇదెంత?: తమన్
X
పుస్తకాల పరంగా చెప్పాలంటే తమన్ చదువుకున్నది ఆరో తరగతి మాత్రమే. ఆయన జీవితాన్ని చదివాడు .. ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. ఆశయాన్ని సాధించాలంటే ఆవేశం ఉండాలి .. అంతకుమించిన అంకితభావం ఉండాలి అనే సత్యాన్ని గ్రహించాడు. ఏది మనసుకు ఇష్టమో అది చేసినప్పుడే రాణించడానికి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని అవగాహన చేసుకున్నాడు. కష్టం ఎదురైంది కదా అని కన్నీళ్లతో కాలాన్ని వృథా చేసుకోలేదు. తాను ఏం చేయాలనే విషయంలో ఒక స్పష్టత ఉంది. ఏ గమ్యం దిశగా ప్రయాణాన్ని మొదలుపెట్టాలనే విషయంలోను ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది. అలా మొదలైన అడుగులే తమన్ ను ఇక్కడివరకూ తీసుకొచ్చాయి.

'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం రన్ అవుతోంది. త్వరలో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఆ ప్రోమోలో తమన్ ప్రస్తావించిన అంశాలు ఏమిటనేది ఆయన మాటల్లోనే విందాం. "6వ తరగతితోనే నా చదువు ఆగిపోయింది. చిన్నప్పటి నుంచి నాకు డ్రమ్స్ వాయించడం ఇష్టం. అందువలన చదువుపై పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. అందువలన నన్ను క్లాస్ బయట నుంచోబెట్టిన సందర్భాలే ఎక్కువ.

నాకు బాడీ బరువుంది గానీ హెడ్ లో వెయిట్ లేదు. 'తమన్ .. నేను ఒక ఫ్లాప్ సినిమాను చేస్తున్నాను .. ఒక ఆరు ఫ్లాప్ పాటలు చేసిపెట్టు' అని ఎవరూ రారు. ఫ్లాప్ వస్తే ఎందుకు వచ్చిందా అనేది నేర్చుకుంటాను. సక్సెస్ వచ్చినా ఎందుకు సక్సెస్ అయిందనేది కూడా నేర్చుకుంటాను. ఇప్పుడు కూడా స్కూల్లో పడిపడి ఎందుకు అంతలా చదువుతున్నారనేది నాకు అర్థం కావడం లేదు. చెన్నైలో నేను సినిమా పోస్టర్స్ చూసే తమిళ్ .. తెలుగు నేర్చుకున్నాను. త్రివిక్రమ్ గారు పరిచయమైన తరువాత, హెడ్మాస్టర్ దగ్గర ఉన్నామనే భయంతో తెలుసు రాయడం నేర్చుకుంటున్నాను.

నా ఫస్టు సినిమా బాలకృష్ణగారి 'భైరవద్వీపం' .. ఆ సినిమాకి డ్రమ్మర్ గా పనిచేశాను .. అప్పట్లో నాకు 30 రూపాయలు ఇచ్చారు. అదే బాలకృష్ణగారి 'అఖండ'కి సంగీత దర్శకుడిగా చేశాను. 'ఈ సినిమాకి నువ్వు కూడా హీరో వే' అన్నారాయన. శంకర్ 'బాయ్స్' సినిమాలో ఒక చిన్న రోల్ చేశాను. చరణ్ తో ఆయన చేస్తున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాను. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి చేరుకోవడానికి 20 ఏళ్లు పట్టింది. నాకు ఇళయరాజా గారు హార్టు అయితే .. రెహ్మాన్ గారు బ్రెయిన్. నేను పుట్టింది ఇళయరాజా గారి టైమ్ లో కనుక బ్లెడ్ లో ఆయన వైరస్ ఎక్కువగా ఉంది.

బాలీవుడ్లో మూడు నాలుగు సినిమాలకి పనిచేశాను. ఒక సినిమాకి ఆరుగురు మ్యూజిక్ ఎలా చేస్తున్నారనేది నాకు అర్థం కాలేదు. ఒక రీల్ ఆర్ ఆర్ చేయండి .. ఒక పాట చేస్తే చాలు అంటూ ఉంటారు. అలా చేస్తే పెళ్లి ఒకరితో ఫస్టు నైట్ ఇంకొకరితో అన్నట్టుగా అయిపోతుంది. మా ఇంట్లో మోస్ట్ టాలెండ్ నా వైఫ్. ఇంట్లోనే ట్రోలింగ్ జరిగిపోద్ది .. ఇక నేను బయట జరిగే ట్రోలింగ్ పెద్దగా పట్టించుకోను. మా అమ్మ కూడా ఏంట్రా ఈ పాటలు అంటూ పప్పులో ఉప్పు తక్కువగా వేస్తూ ఉంటుంది. ఇంట్లో జరిగే ఆ ట్రోలింగ్ ముందు ఇదెంత" అంటూ నవ్వేశాడు.