Begin typing your search above and press return to search.

కేసీఆర్ మీద టీ కాంగ్రెస్ మహిళా నేతల ఫైటింగ్

By:  Tupaki Desk   |   7 May 2016 3:11 PM GMT
కేసీఆర్ మీద టీ కాంగ్రెస్ మహిళా నేతల ఫైటింగ్
X
ఉమ్మడి రాష్ట్రంలోని వైఎస్ హయాంలో తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేతలు పలువురు తరచూ వార్తల్లో కనిపించేవారు. అప్పట్లో వారెంత పవర్ ఫుల్ అన్న విషయం ఇప్పుడు వారి పేర్లు చెప్పినా చటుక్కున గుర్తుకు రావటం ఖాయం. సబితా ఇంద్రారెడ్డి.. గీతారెడ్డి.. డీకే అరుణ.. సునీతా లక్ష్మారెడ్డి.. ఇలా చాలామందే కనిపించేవారు. విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వీరిలో పలువురు ఓటమిపాలు కావటంతో రాజకీయాల్లో అంత దూకుడుగా కనిపించని పరిస్థితి.

ఏం జరిగినా మౌనంగా ఉంటూ.. 2019ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న వారు.. ఉన్నట్లుండి పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా గళం విప్పారు. ఇంతకాలంగా ఆశ్రాయించిన మౌనానికి మంగళం పలికిన వారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాటల ఫైటింగ్ షురూ చేశారు. పాలేరు ఉప ఎన్నికలో సెంటిమెంట్ రాజేసి.. కేసీఆర్ కు భారీ షాక్ ఇవ్వాలని తపిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరికి తగ్గట్లే సబితా ఇంద్రారెడ్డి.. సునీతాలక్ష్మారెడ్డిలు రాసిన తాజా బహిరంగ లేఖలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాద ఇవ్వలేదంటూ భారీ ఆరోపణ చేసిన వారు.. అందుకు ఉదాహరణలు ఉన్నాయంటూ చిట్టా విప్పటం గమనార్హం. ఎంతమంది మహిళల్ని అవమానిస్తారంటూ మండిపడిన ఈ కాంగ్రెస్ మహిళా నేతలు.. తెలంగాణ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లికి టిక్కెట్టు ఇచ్చి వదిలేశారని.. ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని ఆరోపించారు. నిజంగా ఆమె మీద మర్యాద ఉంటే శ్రీకాంతాచారి తల్లిని ఎమ్మెల్సీని ఎందుకు చేయలేదని ప్రశ్నించిన వారు.. గతంలో ఎవరైనా శాసనసభ్యుడు ఆకస్మికంగా మరణిస్తే.. ఆ స్థానాన్ని వారి కుటుంబ సభ్యులకు ఏకగ్రీవం చేసే వారని.. దాన్ని వదిలేసి.. మరణించిన వారిపై విమర్శలు చేయటం ఎలాంటి సంస్కృతి అని వారు ప్రశ్నిస్తున్నారు. పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సెంటిమెంట్ ను నమ్ముకున్నట్లుగా కనిపిస్తుంది. మరి.. వారు నమ్ముకున్న సెంటిమెంట్ ఏ మేరకు వర్క్ వుట్ అవుతుందో తేలాలంటే ఎన్నికల ఫలితం కోసం వెయిట్ చేయాల్సిందే.