Begin typing your search above and press return to search.

‘సచిన్’కు పన్ను మినహాయింపు..సమంజసమా?

By:  Tupaki Desk   |   19 May 2017 11:25 AM GMT
‘సచిన్’కు పన్ను మినహాయింపు..సమంజసమా?
X
అప్పట్లో సచిన్ తెందుల్కర్ కు ఫెరారీ వాళ్లు ఒక కారు బహుమతిగా ఇచ్చారు. దాన్ని ఇండియాకు సచిన్ సొంత ఖర్చులతో దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇలా ఫారిన్ నుంచి కారును ఇండియాకు దిగుమతి చేసుకుంటే.. దానికి పన్ను కట్టాలి. ఐతే ఈ పన్ను మినహాయించమంటూ సచిన్ ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు. ప్రభుత్వం తిరస్కరించింది. అప్పట్లో దీని మీద పెద్ద చర్చే నడిచింది. కోట్లు కోట్లు సంపాదించే సచిన్.. తనకు దక్కిన బహుమతికి పన్ను కట్టకుండా ఎగ్గొట్టాలని చూడటం పెద్ద చర్చకు దారి తీసింది.

సచిన్ ఎంత గొప్ప క్రికెటరైనా కావచ్చు.. అతడికి కోట్లాది మంది అభిమానులు ఉండొచ్చు. కానీ ఇలాంటివి సమంజసంగా అనిపించవు. సచిన్ ను ఏదైనా సేవా కార్యక్రమం కోసం విరాళం అడిగితే.. డబ్బు ఇవ్వడు.. వేలం వేసుకోమంటూ తన బ్యాటు ఇస్తాడంటూ అప్పట్లో బాల్ థాకరే చేసిన విమర్శను ఇక్కడ ప్రస్తావించాలి. గొప్ప క్రికెటర్ గా సచిన్ లోని సుగుణాల గురించే మీడియాలో చర్చ నడుస్తుంటుంది కానీ.. రాజ్య సభ సభ్యుడిగా సభకు అప్పుడప్పుడూ అయినా హాజరై తన బాధ్యతను నెరవేర్చకపోవడం గురించి మాత్రం పెద్దగా డిస్కషన్ ఉండదు. రాజ్యసభకు రాలేని సచిన్.. ముంబయి ఆడే ప్రతి ఐపీఎల్ మ్యాచ్ కూ మాత్రం ఠంచనుగా హాజరవుతాడు.

ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకయ్యా అంటే.. సచిన్ జీవితం మీద ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇది ఫక్తు సినిమా ఏమీ కాదు. సచిన్ చిన్నప్పటి జీవితాన్ని నటీనటులతో షూట్ చేసి.. ఆ తర్వాత అతడి కెరీర్లోని కీలక మ్యాచ్ లకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్.. సచిన్ సొంత నరేషన్.. కొందరు ప్రముఖల బైట్స్ కలిపి ఓ డాక్యుమెంటరీలాగా దీన్ని రూపొందించారు. దీనికి పెద్దగా ఖర్చయిందేమీ లేదు. చాలా తక్కువ బడ్జెట్లో రూపొందించారు. ఈ సినిమా హక్కుల కోసం నిర్మాత సచిన్ కు భారీ మొత్తంలోనే సమర్పించుకున్నట్లు సమాచారం. సినిమాకు బిజినెస్ బాగానే కావడంతో నిర్మాత కూడా బాగానే లాభపడ్డట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం క్రికెట్ వీడియోల్ని ఉచితంగా వాడుకోవాలని చూశాడు సచిన్. కానీ బీసీసీఐ అందుకు ఒప్పుకోలేదు. వాటికి డబ్బులివ్వాలని అంది. ‘ధోని’ సినిమా కోసం వాళ్లు కూడా డబ్బులు పెట్టే వీడియోలు కొన్నారని చెప్పింది. అక్కడ నిరాశ ఎదురయ్యాక సచిన్.. ఈ సినిమాకు పన్ను మినహాయింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆల్రెడీ కేరళ.. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాలు వరాలిచ్చేశాయి. మిగతా ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తెస్తున్నారు. సచిన్.. ప్రధాని నరేంద్ర మోడీని కలవడంలో కూడా ఉద్దేశం ఇదే. ఐతే సచిన్ మీద సినిమా తీసి.. వాళ్ల వరకు వాళ్లు బాగానే సొమ్ము చేసుకున్నారు. కానీ పన్ను మినహాయింపులు కోరుతున్నారు. ఇప్పుడు సచిన్ సినిమా వల్ల జనాలకు ఏ రకంగా ఉపయోగం.. ఈ సినిమా తీయడానికి వాళ్లెంతగా కష్టపడిపోయారు.. ఎన్ని త్యాగాలు చేశారు.. అన్నది ఆలోచిస్తే దీనికి పన్ను మినహాయంపు ఇవ్వాలా లేదా అన్నది సులువుగా అర్థమైపోతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/