Begin typing your search above and press return to search.

ఫ్లాప్ హీరో టచింగ్ మెసేజ్

By:  Tupaki Desk   |   14 Oct 2018 9:27 AM GMT
ఫ్లాప్ హీరో టచింగ్ మెసేజ్
X
విజయాల్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. గొప్పలు చెప్పుకుంటారు. కానీ అపజయాలు వచ్చినపుడు వాటి గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. నిజాయితీగా వైఫల్యాల్ని అంగీకరించరు. ముఖ్యంగా సినీ రంగంలో ఫెయిల్యూర్ల గురించి ఓపెన్ గా మాట్లాడేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఐతే మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మాత్రం తన ఫెయిల్యూర్ల గురించి నిజాయితీగా స్పందించాడు. ఒకప్పుడు ‘పిల్లా నువ్వు లేని జీవితం’.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ‘సుప్రీమ్’ లాంటి హిట్లతో దూసుకెళ్లిన తేజు.. ఆ తర్వాత వరుసబెట్టి ఆరు డిజాస్టర్లు ఇచ్చాడు. చివరగా ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘తేజ్ ఐ లవ్యూ’ కూడా నిరాశ పరిచింది. దీంతో అతడి కెరీర్ ప్రమాదంలో పడింది. ఈసారి గ్యాప్ తీసుకుని మంచి సినిమాతో రావాలన్న పట్టుదలతో అతను కనిపిస్తున్నాడు.

ఇలాంటి తరుణంలో తేజు పుట్టిన రోజు వచ్చింది. ఈ సందర్భంగా అతనొక టచింగ్ మెసేజ్ తో మెగా అభిమానుల్ని పలకరించాడు. ‘‘గెలిచినపుడు వేలకు పైగా చేతులు చప్పట్లు కొడతాయి. ఓడిపోయినా మీ చేతుల చప్పట్ల చప్పుడు కూడా తగ్గకుండా జయాపజయాలకూ అతీతంగా నన్ను ప్రోత్సహిస్తూ వెన్నంటి ఉన్న అభిమానులందరికీ కృతజ్ఞతలు. ఈ మధ్య కాలంలో మీ అంచనాలను అందుకోలేకపోయానన్నదివాస్తవం. దానికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నాను. మీ సలహాలు.. సూచనలను తీసుకుని చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ.. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో ఉన్నాను. మీరు నాపై చూపించే అభిమానమే నన్ను మానసికంగా దృఢంగా ఉంచి మంచి సినిమాలు చేయడానికి ఉత్సాహాన్నిస్తుంది’’ అని తేజు చెప్పాడు. ఇలా తన ఫెయిల్యూర్లను ఒప్పుకోవడం అందరి వల్లా కాదు. ఈ రియలైజేషన్ ఎవరికైనా మేలు చేస్తుంది. తేజుకు కూడా అలాగే మేలు చేస్తుందని.. అతను మళ్లీ ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల్ని పలకరిస్తాడని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.