Begin typing your search above and press return to search.

సేవా సంస్థకు తేజు బ్రాండింగ్

By:  Tupaki Desk   |   16 Oct 2017 4:04 AM GMT
సేవా సంస్థకు తేజు బ్రాండింగ్
X
హీరోగా ఇండస్ట్రీలో ఇమేజ్.. యాక్టర్ గా ప్రేక్షకుల్లో పాపులారిటీ ఉంటే.. వారి వెంట వ్యాపార సంస్థలు పరుగులు తీస్తున్న రోజులివి. హీరోలకుంటే క్రేజ్ తో తమ వ్యాపార ఉత్పుత్తులను బాగా విక్రయించుకోవచ్చనే నమ్మకంతో ఏరికోరి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటున్నారు. ఇవన్నీ డబ్బులు.. లాభాపేక్షతో కూడుకున్న వ్యవహారాలే. కానీ సేవా దృక్పథంతో బ్రాండ్ అంబాసిడర్ ఉండటానికి ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్.

సాయి ధరమ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ కొత్త నిర్ణయం తీసుకున్నాడు. విశాఖపట్నం జిల్లాలోని గిరిజన ప్రాంత అభివృద్ధికి పనిచేస్తున్న ‘థింక్ పీస్’ స్వచ్ఛంద సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి అంగీకారం తెలిపాడు. ఈ సంస్థ గిరిజన - గ్రామీణ ప్రాంతాల్లో విద్య వైద్యం ఆరోగ్యం న్యాయపరమైన హక్కులు సమానత్వం వంటివి పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటైంది. సమాజ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంస్థకు పూర్తిస్థాయిలో తోడ్పాటు అందించడానికి తేజు ముందుకొచ్చాడు.

థింక్ పీస్ తో సాయిధరమ్ తేజ్ ప్రయాణం ఇప్పటిది కాదు. ఈ సంస్థకు పరోక్షంగా అతడు సాయం అందిస్తూనే ఉన్నాడు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో లో తేజు ఓసారి పాల్గొన్నాడు. ఆ సందర్భంగా తాను గెలుచుకున్న మొత్తాన్ని ఈ సంస్థకే విరాళంగా ఇచ్చాడు. ఇప్పుడు ఆ సంస్థకు మరింత అందదండలు అందించేందుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి ఒప్పుకున్నాడు. ఈ స్టెప్ తో తేజు మెగా అభిమానులతో పాటు అందరి మనసులు గెలుచుకున్నాడు.