Begin typing your search above and press return to search.

తేజు టార్గెట్ తిరుమలే!

By:  Tupaki Desk   |   10 July 2018 7:29 AM GMT
తేజు టార్గెట్ తిరుమలే!
X
విజయవంతంగా డిజాస్టర్స్ లో డబల్ హ్యాట్రిక్ పూర్తి చేసిన సాయి ధర్మ తేజ్ పరిస్థితి తేజ్ ఐ లవ్ యు తర్వాత ఇంకా ఇబ్బందికరంగా మారింది. కొత్తగా ఉంటుంది కదా అని లవ్ స్టోరీని ఓకే చేస్తే దర్శకుడు కరుణాకరన్ పాతగానే ఆలోచించడంతో రిజల్ట్ పూర్తిగా తేడా కొట్టేసింది. నష్టాలు ఎంత తగ్గుతాయి అని ఎదురు చూడటం మినహా అభిమానులు సైతం వసూళ్ల మీద ఆశలు వదిలేసుకున్నారు. ప్రమోషన్ చేస్తూ దర్శకుడు ఎంతగా కవర్ చేసుకుంటున్నా అవి ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఆరు సినిమాలు వరసగా ఫెయిల్ అయ్యాక ఏ హీరోకైనా మనుగడ అంత ఈజీ కాదు. కానీ అంతకు ముందు చేసిన కొన్ని సినిమాల విజయాలు మెగా కాంపౌండ్ అనే బ్రాండ్ ఇంకా అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయి. కాకపోతే ఇవన్నీ ఇంతకు ముందు కమిట్ అయినవి కావడంతో సెట్స్ పైకి వెళ్ళబోతున్నాయి.

సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ చేయబోతున్న మూవీ దర్శకుడు కిషోర్ తిరుమలది. మైత్రి మూవీ మేకర్స్ దీనికి నిర్మాత. మహేష్ బాబు-రవితేజ లాంటి అగ్ర హీరోలతో ప్రాజెక్ట్స్ చేస్తున్న మైత్రి తేజుతో చేయటం విశేషమే. దర్శకుడు కిషోర్ తిరుమల తీసిన రెండు సినిమాల్లో అతని డెబ్యూ మూవీ నేను శైలజ ఒకటే హిట్. రెండోది ఉన్నది ఒకటే జిందగీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మరి ఇప్పుడు తేజుకి ఎలాంటి సినిమా ఇస్తాడా అని మెగా ఫాన్స్ టెన్షన్ పడటం సహజమే. ముంచినా తేల్చినా అతను తప్ప ప్రస్తుతానికి వేరే ఆప్షన్ లేకపోవడంతో ఈసారైనా గట్టి హిట్టు ఒకటి ఇవ్వమని కోరుతున్నారు. ఇప్పటికే తేజు చాలా రిస్క్ జోన్ లో ఉన్నాడు. ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎంత బలంగా ఉన్నా ఇలాంటి పరాజయాల వల్లే సుమంత్ లాంటి హీరోలు చాలా ఎక్కువ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అలా జరగకుండా ఉండాలి అంటే తేజుకి యావరేజ్ కాదు కనీసం ఒక్క సూపర్ హిట్ అయినా పడాలి. భారమంతా తిరుమల మీదే ఉంది.