Begin typing your search above and press return to search.

మెగా క్లాష్ దేనికి సంకేతం

By:  Tupaki Desk   |   28 Jan 2018 6:54 AM GMT
మెగా క్లాష్ దేనికి సంకేతం
X
సరిగ్గా 20 ఏళ్ళ క్రితం అంటే 1998లో జూలై 24న పవన్ తొలిప్రేమ విడుదలైంది. స్లో టాక్ తో మొదలై చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేసింది. సిల్వర్ జూబ్లీ ఆడే దాకా దాని పరుగు ఆగలేదు. అది వచ్చిన నెలకే ఆగష్టు 27 మెగాస్టార్ చిరంజీవి చూడాలని ఉంది భారీ ఎత్తున విడుదల చేసారు. ఇంకా తమ్ముడి సినిమా థియేటర్స్ లో ఉండగానే అన్నయ్యది తీసుకొచ్చారే ఏదో ఒకటి దెబ్బ తినడం ఖాయం అనుకున్నారు. కాని ఆ అంచనాలకు భిన్నంగా చిరు సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచి అత్యధిక కేంద్రాల్లో వంద రోజులు ఆడింది.అప్పటి రోజులు వేరు. పైరసీ ప్రభావం ఇప్పుడున్నంత లేదు. టెక్నాలజి - 4జి - స్మార్ట్ ఫోన్ - ఆన్ లైన్ రివ్యూలు ఇవేవి లేవు కాబట్టి రిపీట్ రన్స్ తో పాటు ఫ్యామిలీలు మొత్తం థియేటర్ కు వచ్చి సినిమా చూసేవి. ఇప్పుడు అంతా మారిపోయింది. ఉదయం షో పడిన పది నిమిషాల నుంచే స్క్రీన్ మీద ఏం జరుగుతుందో వరస బెట్టి సోషల్ మీడియాలో అప్ డేట్స్ చూసుకునే పరిస్థితి వచ్చింది.

ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా. అప్పట్లో పోటీకి ఇన్ని పరిమితులు లేవు కాబట్టి నిర్మాతలు సేఫ్ అవ్వడమే కాక లాభాలు కళ్ళజూసేవారు. ఇప్పుడు పోటీ అంటే ఒకటి బాగుంటే రెండో దాని మీద తీవ్ర ప్రభావం పడుతోంది. రెండూ బాగున్నా సరిసమానమైన వసూళ్లు వస్తాయాన్న గ్యారెంటీ లేదు. అందుకే విడుదల తేది విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఇప్పుడు ఫిబ్రవరి 9న వస్తున్న మెగా హీరోల సినిమాలు తొలిప్రేమ - ఇంటెలిజెంట్ క్లాష్ కావడం ట్రేడ్ తో పాటు ఫాన్స్ లో ఆసక్తి రేపుతోంది.

నిజానికి వరుణ్ తేజ్ కాని - సాయి ధరమ్ తేజ్ కాని భారీ స్థాయిలో ఓపెనింగ్స్ తెచ్చే రేంజ్ కి ఇంకా చేరుకోలేదు. డీసెంట్ హిట్స్ తో తమ కెరీర్ ని ఇప్పుడిప్పుడే సెట్ చేసుకుంటున్నారు. మెగా ఫాన్స్ లో ఇద్దరి పట్ల ఒకే రకమైన సానుకూల అభిప్రాయం ఉంది. మరి ఇలా క్లాష్ కావడం పట్ల కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఒక సినిమా చూసి బయటికి వచ్చే లోపు రెండో సినిమా జాతకం మొత్తం బయటపడిపోయి ఉంటుందని, అలాంటప్పుడు చాలా బాగుంది అని టాక్ వస్తే తప్ప అభిమాని రెండో సినిమా వెంటనే చూసే పరిస్థితి ఉండదని చెప్పొచ్చు. మరి పట్టుబట్టి డేట్ విషయంలో ఇద్దరు నిర్మాతలు పట్టుసడలించకుండా ఒకే రోజు రెండు మెగా సినిమాలు తేవడం పట్ల ఏది ఎక్కువ నిలుస్తుంది అనే దాని గురించి అంచనాలు మొదలయ్యాయి. సబ్జెక్టు పరంగా ఒకటి క్లాస్ ఒకటి మాస్ అయినప్పటికీ పోటీ మాత్రం తప్పదు కనక ఇద్దరు గెలుస్తారా లేక ఒకరే విజేత అవుతారా అనేది ఆ రోజే తేలుతుంది.